రంగురాళ్ల దొంగల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల దొంగల రిమాండ్‌

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

వీర్నపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఫారెస్ట్‌ క్వార్టర్స్‌లో జరిగిన రంగురాళ్ల దొంగతనం కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై వి.లక్ష్మణ్‌ తెలిపిన వివరాలు. మండలంలోని అడవిపదిరకు చెందిన వేముల శేఖర్‌, వేముల అలియస్‌ ఎముల ఆదివిష్ణు, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన బత్తుల ప్రవీణ్‌ అటవీ ప్రాంతం నుంచి రంగురాళ్లు సేకరిస్తున్నట్లు తెలుసుకున్న గర్జనపల్లి అటవీ అధికారులు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రెండు బస్తాల రంగురాళ్లను స్వాధీనం చేసుకుని ఈనెల 5న గర్జనపల్లి ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లో భద్రపరిచారు. అదే రాత్రి గెస్ట్‌హౌస్‌లో భద్రపరిచిన రంగురాళ్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 60 కిలోల రంగురాళ్లతోపాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

పేకాడుతూ పట్టుబడిన విండో చైర్మన్‌

శంకరపట్నం: కేశవపట్నంలోని ఓ ప్రాంతంలో సాగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి టాస్క్‌పోర్స్‌ ఏసీపీ సతీశ్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు. గద్దపాక విండో చైర్మన్‌ బసవయ్యతో పాటు పలువురు పట్టుబడ్డారు. వారినుంచి రూ.11,350 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

కరీంనగర్‌ బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో డివైడర్‌పై ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని, లేత గులాబీ రంగు ఫుల్‌హ్యాండ్స్‌ టీషర్ట్‌, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు వన్‌టౌన్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

ఉరేసుకొని రైతు ఆత్మహత్య

జమ్మికుంట: జమ్మికుంట మండలం పాపక్కపల్లిలో అప్పుల బాధతో ఓ రైతు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన పుట్టకొక్కుల రాజయ్య (62) తనకున్న రెండెకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడికి రూ.10లక్షల అప్పు చేశాడు. దిగుబడులు అశించిన మేరకు రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్యకు భార్య రాధ, కూతురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement