రోడ్డుపై పడుతున్న
పెద్దపెద్ద బండరాళ్లు
అధిక లోడ్ లారీలతో జనంప్రాణాలకు ముప్పు
జిల్లా రహదారులపై ప్రమాద ఘంటికలు
నిబంధనలు గాలికి.. పట్టని అధికారులు
ఘటనలు జరిగినప్పుడే హడావుడి
విజిలెన్స్, రవాణాశాఖ తనిఖీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
జిల్లాలో గ్రానైట్ లారీలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. పరిమితికి మించిన లోడ్, ఓవర్ స్పీడ్‌తో భయాందోళనకు గురిచేస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం.. రక్షణ చర్యల్లో లోపాలతో లారీల్లోంచి టన్నుల బరువున్న బండరాళ్లు రోడ్డుపై జారి పడుతున్నాయి. లారీల వెనుక వెళ్తున్న వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తుండగా.. జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడే అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తుండగా.. నగరం లోపలి నుంచి పొద్దంతా బండ లారీలను అనుమతించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని కరీంనగర్, కొత్తపల్లి, హుజూరాబాద్, శంకరపట్నం, తిమ్మాపూర్, చిరుగుమామిడి, మానకొండూర్, గంగాధర, రామడుగుతో పాటు పలు మండలాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఆయా క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యల లారీల ద్వారా బండరాళ్లను తరలిస్తుంటారు. కొన్ని ప్రాంతాల నుంచి బండను కరీంనగర్, గంగాధర రైల్వేస్టేషన్లకు తరలిస్తుండగా.. మరికొందరు నేరుగా పొరుగు రాష్ట్రంలో ఉన్న పోర్టుకు తీసుకెళ్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బండ లోడింగ్, రవాణా నిబంధనలను లారీలు పాటించడం లేదు. పరిమితికి మించి లోడ్ చేసుకుని గ్రామీణరోడ్లతో పాటు, హైవేపైనా దూసుకెళ్తున్నారు. ఎలాంటి సూచిక లేకుండా రోడ్ల పక్కన వాహనాలు నిలుపు తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కొందరు రెండు, మూడు బండలు ఓవర్ లోడ్ చేసుకుని వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో పొద్దంతా, రాత్రంతా జిల్లాలోని గ్రామీణ, ప్రధాన రహదారులపై వందల సంఖ్యలో లారీలు దూసుకెళ్తున్నాయి. ఒద్యారం, బావుపేటతో పాటు తిమ్మాపూర్, మానకొండూర్ వైపు నుంచి కరీంనగర్, గంగాధర రైల్వేస్టేషన్లకు వరుస కడుతుంటాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో బండలు రోడ్లపై పడిపోతున్నాయి. ఇటీవల మానకొండూర్‌లో జరిగిన ఘటనలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కాగా.. నగరంలోని కోర్టు చౌరస్తా, పద్మనగర్ తదితర ప్రాంతాల్లోనూ బండరాళ్లు జారిపడిన ఘటనలు ఉన్నాయి. గంగాధర, రామడుగు మండలాల్లో తరచూ గ్రానైట్ లారీలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఆయా సందర్భాల్లో ప్రాణనష్టం జరి గితే బాధ్యత ఎవరిదని వాహనదారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తనిఖీలతో వదిలి పెట్టొద్దని, రవాణా, గనులు, పోలీసుశాఖ సమన్వయంతో వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈనెల 27న మానకొండూర్ చెరువుకట్ట వద్ద బావుపేట వైపు వెళ్తున్న లారీ నుంచి భారీ గ్రానైట్ బండరాయి రోడ్డుపై పడడంతో నాలుగు గంటలు ట్రాఫిక్ స్తంభించింది. బండ పడడానికి రెండు నిమిషాల ముందే పక్కనుంచి ప్రయాణికులతో ఆటో వెళ్లిందని.. తృటిలో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా.. లారీ సంబంధికులు ఎవరూ అటువైపు చూడలేదు. పోలీసులు, స్థానికులు కష్టపడి బండరాయిని పగులగొట్టి పక్కకు నెట్టారు.
కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ ఒడ్డెపల్లి వద్ద బుధవారం రాత్రి సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ అధికారులు గ్రానైట్ లారీలపై దాడులు నిర్వహించారు. మొత్తం 15 లారీలను తనిఖీ చేశారు. వాటిలో ఎనిమిది లారీలకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేవని, మరో ఐదు లారీలు అధికలోడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. గ్రానైట్ రవాణాలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై తనిఖీ చేపట్టినట్లు తెలిసింది.
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా నుంచి కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు గ్రానైట్‌బండను తరలిస్తున్న లారీ ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే శ్రీపురంకాలనీ, ఖార్ఖానగడ్డ, మంచిర్యాల చౌరస్తా మీదుగా ప్రయాణించడంతో పక్కనుంచే వెళ్తున్న ద్విచక్ర, ఇతర వాహనదారులు బండ ఎక్కడ పడిపోతుందోననే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. భారీ వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


