తగ్గనున్న చెత్తగుట్ట | - | Sakshi
Sakshi News home page

తగ్గనున్న చెత్తగుట్ట

Oct 30 2026 12:45 AM | Updated on Oct 30 2026 12:45 AM

చెత్త తగ్గించే చిత్తశుద్ధి మాదే

రూ.16 కోట్లతో 2.34 లక్షల టన్నుల చెత్త బయోమైనింగ్‌కు టెండర్‌

26వ తేదీతో ముగిసిన గడువు

పాల్గొన్న నలుగురు కాంట్రాక్టర్లు

పది రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ

కరీంనగర్‌కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌లోని చెత్తగుట్టకు కదలికవస్తోంది. ఏళ్లకాలంగా డంప్‌యార్డ్‌ బాధితులు చేస్తున్న ఆందోళనలు ఫలించే క్షణం సమీపిస్తోంది. డంప్‌యార్డ్‌లో దాదాపు నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉండగా, 2.34 లక్షల మెట్రిక్‌ టన్నులు బయోమైనింగ్‌ చేసేందుకు నగరపాలకసంస్థ టెండర్‌ పిలిచింది. బిడ్‌ దాఖలుకు గడువు ముగియగా, మిగితా ప్రక్రియ కొనసాగుతోంది.

చెత్త బయోమైనింగ్‌కు టెండర్‌

డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు సుదీర్ఘకాలం తరువాత స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద సుమారు రూ.16 కోట్లతో టెండర్‌ పిలిచారు. ఈ నెల 26తో టెండర్‌ గడువు ముగిసింది. టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేయగా, నలుగురు కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ల డాక్యుమెంట్లు, ఇతరత్రా పత్రాల పరిశీలన జరుగుతోంది. ఎవాల్యుయేషన్‌ పూర్తయిన తరువాత నలుగురు కాంట్రాక్టర్లలో నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు, ఎవరు కాదు అనే రిపోర్ట్‌ను ఈఎన్‌సీకి పంపిస్తే ఆయన అర్హులెవరనేది నిర్ధారిస్తారు. ఆ తరువాత అర్హులైన కాంట్రాక్టర్లకు సంబంధించి ప్రైస్‌ బిడ్‌ ఓపెన్‌ చేసి, టెండర్‌ ఖరారు చేస్తారు. టెండర్‌ ఖరారయ్యాక సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి వారం, పదిరోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తొలగనున్న 2.34లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త

నగరంలోని డంప్‌యార్డ్‌లో దాదాపు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త నిల్వ ఉంది. ప్రతి రోజు 150 టన్నులు డంప్‌యార్డ్‌లోకి చేరుతోంది. యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయి మంటలు, పొగ రావడంతో సగం నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రజలు అనారోగ్యానికి గురవుతుండడంతో తమ ఆందోళనను వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సగం చెత్తను ఖాళీచేసేందుకు నగరపాలకసంస్థ సమాయత్తమైంది. 2.34లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయనుంది.

రూ.80 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌

డంప్‌యార్డ్‌లో ఉన్న చెత్తను బయోమైనింగ్‌ ద్వారా తగ్గించడంతో పాటు, అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌) నిధులు రూ.80 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు నగరపాలకసంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యూసీఎఫ్‌ పథకంలో నగరానికి రూ.840 కోట్లు రానుండడం తెలిసిందే. ప్రస్తుతం ప్రక్రియ డీపీఆర్‌ దశలో ఉంది. ఈ నిధుల్లోని రూ.80 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రతిపాదించారు. ఇది ఆచరణకు నోచుకొంటే డంప్‌యార్డ్‌ సమస్య నగరానికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశముంది.

గత పాలకుల తరహాలో మాటలతో సరిపెట్టకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. సగం చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు టెండర్‌ పిలిచాం. క్రమంగా డంప్‌యార్డ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. బయోమైనింగ్‌కు టెండర్‌ పిలవడంతో, విపక్షాలు మళ్లీ ఆందోళనల పేరిట నాటకాలకు తెరతీస్తున్నాయి. డంప్‌యార్డ్‌ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నది కేవలం బీజేపీ పాలకవర్గం మాత్రమే.

– కొలగాని శ్రీనివాస్‌, నగర మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement