ఎల్‌నినో నేపథ్యంలో ఈ సారి వరి సాగు 1.49 లక్షల ఎకరాలే
టీఎస్ సీడ్స్‌లో వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు
‘సాక్షి’ ముఖాముఖిలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్
కరీంనగర్ అర్బన్: ‘సాగురంగంలో ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణతో సాగుతున్నాం. అన్నదాతను అప్రమత్తం చేస్తున్నాం. ఆరుతడి పంటలకే ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం’ అని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్ స్పష్టం చేశారు. ఎల్‌నినో క్రమంలో యాసంగి యాక్షన్ ప్లాన్‌లో వరిసాగును సగానికి తగ్గించామని, బోర్లు, బావుల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగానే ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటలు, రాయితీ విత్తనాలు, రైతులకు విజ్ఞానం అందించడంలో ‘ఆత్మ’ పాత్ర వంటి అంశాలపై గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.
వాతావరణశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో యాసంగి యాక్షన్‌ప్లాన్‌ను పక్కాగా రూపొందించాం. గత యాసంగిలో 2.82లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సారి 1,49,063 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించాం. మిగతా విస్తీర్ణంలో తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న 6,0177 ఎకరాలు, శనగ 1,446, మినుములు 2,188, పెసలు 4,578, వేరుశనగ 6,114, పొద్దుతిరుగుడు 1,339, నువ్వులు 939 ఎకరాల్లో వేసేలా చర్యలు చేపడుతున్నాం. గతంలో ఆరుతడి పంటల విస్తీర్ణం 40వేల ఎకరాల వరకు ఉండేది. ఈ సారి మరో 50వేల ఎకరాలు సాగయ్యేలా అవగాహన కల్పిస్తున్నాం.
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ద్వారా రైతులకు పూర్తిస్థాయి అవగాహన వచ్చేలా క్షేత్రస్థాయి సందర్శన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం రూ.17లక్షలు కేటాయించగా సదరు నిధులను వివిధ అంశాల్లో అవగాహనకు వినియోగిస్తున్నాం. చేపల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ తదితర వాటిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.
రానున్న గడ్డు పరిస్థితుల క్రమంలో రైతులకు నిత్య ఆదాయముండేలా కూరగాయల సాగును పెంచాలని చెబుతున్నాం. గతంలో 564 ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ఈ సారి 916 ఎకరాల్లో సాగు పెంచేలా చర్యలు చేపడుతున్నాం. ఎలాంటి విపత్తులోనైనా ఆదాయాన్నిచ్చే ఆయిల్ పాం రైతులకు కొండంత అండ. ఒక్కసారి మొక్కలు నాటితే దశాబ్దాల తరబడి పంట వస్తుండగా లాభాలు ఎక్కువ. గత యాసంగిలో 97 ఎకరాల్లో సాగు కాగా ఈ సారి 680 ఎకరాల్లో సాగయ్యేలా అవగాహన కల్పిస్తున్నాం.
ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు రాయితీపై విత్తనాలు ఇచ్చేందుకు టీఎస్ సీడ్స్ చర్యలు చేపడుతోంది. కరీంనగర్(పద్మనగర్), హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు ప్రాంతాల్లోని వారి కేంద్రాల ద్వారా వేరుశఽనగ, పొద్దుతిరుగుడు విత్తనాలను 50శాతం రాయితీపై విత్తనాలను అందిస్తున్నారు. రాయితీపై ఇచ్చే విత్తనాలను రైతులకు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసేప్పుడు రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.
యాసంగిలో రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. గత అనుభవాల క్రమంలో యాప్‌ను కూడ ప్రభుత్వం ఆధునీకరించింది. ప్రధానంగా యూరియాకు ఏలాంటి కొరత ఉండదు. యాప్‌లోనే సమీప దుకాణాల్లో ఎరువులను బుక్ చేసుకుని తీసుకోవచ్చు.
ఎస్‌ఎంఎఎం పథకం ద్వారా రైతు సొసైటీలకు యంత్రాలను రాయితీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు 10 యూనిట్లు మంజూరయ్యాయి. కరీంనగర్, చొప్పదండి వ్యవసాయ డివిజన్లకు రెండేసి యూనిట్లు కేటాయించగా హుజూరాబాద్, మానకొండూరు డివిజన్లకు మూడేసి యూనిట్లు కేటాయించాం. కరీంనగర్, చొప్పదండి యూనిట్లు జనరల్‌కు కేటాయించగా హూజూరాబాద్‌లో ఒకటి ఎస్టీ యూనిట్, రెండు జనరల్, మానకొండూరులో ఒకటి ఎస్సీ, రెండు జనరల్‌కు కేటాయించాం. హార్వెస్టర్, రోటవేటర్, ట్రాక్టర్, దాల్‌మిషన్ తదితర యంత్రాలు ఇవ్వనున్నాం. ప్యాక్స్, రైతు సంఘాలకు మాత్రమే అర్హత మేరకు ఇవ్వనున్నాం.


