కరీంనగర్ కార్పొరేషన్: పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మేయర్ కొలగాని శ్రీనివాస్ హెచ్చరించారు. రోడ్లపై చెత్త వేస్తే రూ.వెయ్యి నుంచి రూ.5వేలు జరిమానా వి ధించాలని ఆదేశించారు. గురువారం వేకువజాము న 58,66 డివిజన్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణతో పాటు టవర్‌సర్కిల్, పాత శివాలయం ప్రాంతాల్లో పారిశుఽ ద్య కార్మికుల బయోమెట్రిక్, హాజరు పాయింట్లను సందర్శించారు. టవర్‌సర్కిల్ ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణను కార్పొరేటర్ వంగల పవన్‌తో కలిసి పరిశీలించారు. పలు రోడ్లు, వీధుల్లో చెత్త ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహించారు. పనితీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటో కార్మికులకు అందించాలన్నారు. సహాయ కమిషనర్ రాజమనోహర్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.


