గంభీరావుపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన మహ్మద్ రెహాన్(14) అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. రెహాన్ కామారెడ్డిలోని మదర్సా అరేబియా కాశీపూల్ ఉత్తమ్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. దసరా సెలవుల అనంతరం తండ్రి షేక్ ఇమామ్ తన కుమారుడిని బడికి పంపించి వచ్చాడు. మరుసటి రోజే రెహాన్ తిరిగి ఇంటికొచ్చాడు. తనకు సెల్ఫోన్ కొనివ్వాలని లేకుంటే బడికి వెళ్లనని పట్టుబట్టాడు. ఈనెల 25న రెహాన్ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. బాలుడి అచూకీ ఎంతకీ లభించకపోవడంతో తండ్రి ఇమామ్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


