నిలిచిన అరెస్టు.. మొదలైన బెదిరింపులు..
నగరంలో మళ్లీ మొదలైన ఆక్రమణలు
నకిలీ పత్రాలతో సామాన్యుడి భూమి అక్రమ రిజిస్ట్రేషన్
మాజీ కార్పొరేటర్ సహా 13 మందిపై కేసు
నిందితుడిని అరెస్ట్ కాకుండా పోలీసులపై పెద్దనేత ఒత్తిడి
యాంటిస్పేటరీ బెయిల్ కోసం నిందితులకు దొరికిన గడువు
స్థలంలోకి వస్తే చంపుతానని మాజీ కార్పొరేటర్ బెదిరింపులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
కరీంనగర్‌లో భూ బకాసురులు మళ్లీ నిద్రలేస్తున్నారు. నాడు భూమాఫియాపై ఉక్కుపాదం మోపిన పాత సీపీ మహంతి హయాంలో సమసిపోయిన వివాదాలు తిరిగి కొత్తరూపంలో బయటికి వస్తూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. నగరం నడిబొడ్డున అందులోనూ వన్‌టౌన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. సామాన్యుడి భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ మాజీ కార్పొరేటర్ కలిసి అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాన్ని పోలీసులు భగ్నం చేయగలిగారు.
నగరంలోని కోతిరాంపూర్‌లోని విలువైన ప్రాంతంలో దాదాపు మూడుగుంటల భూమి కబ్జాకు జరిగిన ప్రయత్నాన్ని వన్‌టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో చిన్నపాటి కూలిపని చేసుకుంటూ బతికే అన్నదమ్ములు కోతిరాంపూర్‌లో 2019లో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ భూమికి సరిహద్దులు పెట్టుకుని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పక్కసర్వే నెంబరులోని కొందరు వ్యక్తులు ఈ భూమి తమదంటూ కొన్ని నకిలీ పత్రాలు సృష్టించారు. భూ యజమానులు భూమిలోకి రావొద్దంటూ అది తమదని బాధితులను బెదిరింపులకు గురిచేశారు. వాస్తవానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. 2024లో సీపీగా మహంతి ఉన్న సమయంలోనే వివాదం పోలీసుల వద్దకు చేరింది. ఆ సమయంలో నిందితులు సర్వే ప్రకారం నడుచుకుంటామని ఎలాంటి గలాటా చేయబోమని పోలీసులకు హామీ ఇచ్చి తప్పుకుంటారు. తాజాగా అదే భూమిపై తిరిగి వివాదం లేవదీశారు. నకిలీ పహాణీలు సృష్టించి, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి సదరు భూమిని తమపేరిట రిజిస్ట్రేషన చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన భూమిలో సరిహద్దులు చెరిపేసిన విషయాన్ని గుర్తించిన యజమానులు తిరిగి పోలీసులను ఆశ్రయించారు. అక్కడ నిందితులు ఆ భూమి తమదంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించారు. దీంతో పోలీసులు సదరు పత్రాలపై కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అభిప్రాయం కోరారు. దీంతో సదరు డాక్యుమెంట్లు, తహసీల్దార్ సంతకం, స్టాంపులు ఫోర్జరీవని తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ భూమి కబ్జాలో భాగస్వాములుగా మాజీ కార్పొరేటర్ సహా మొత్తం 13 మందిపై కబ్జాతోపాటు పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్లపై కేసు నమోదైంది. దీంతో నిందితుల అరెస్టు అనివార్యమైంది.
ఈ విషయంలో మాజీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు వెళ్లి జిల్లాకు చెందిన ఓ బడా నేతను ఆశ్రయించారు. తాము అరెస్టయితే పరువు సమస్యగా మారుతుందని, జిల్లాకు చెందిన ఓ పెద్దనేతను ఆశ్రయించారు. ఆయనకు అసలు విషయం చెప్పకుండా విషయాన్ని తమకు అనుకూలంగా మలిచి చెప్పారు. దీంతో సదరు నేత పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పండగ వరకు అరెస్టు చేయవద్దని ఒత్తిడి చేయడంతో పోలీసులు అరెస్టు నిలిపివేసినట్లు సమాచారం. ఇదే అదనుగా తాము అరెస్టు కాకుండా యాంటిస్పేటరీ బెయిల్ కోసం నిందితులంతా ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు తన పలుకుబడితో అరెస్టు నిలిచిపోవడంతో సదరు మాజీ కార్పొరేటర్ తమపై బెదిరింపుల పర్వానికి తెరలేపాడని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమను స్థలంలోకి రానీయడం లేదని, వస్తే చంపుతానని బెదిరించడంతో ఏంచేయాలో పాలుపోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని ‘సాక్షి’తో వాపోయారు. తమలాంటి సాధారణ వ్యక్తులకు పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.


