వైభవంగా దసరా
కరీంనగర్: జమ్మి చెట్టు వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ పూజలు, గిద్దె పెరుమాండ్ల
ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూజలు
దసరా వేడుకలు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కరీనగర్ సిటీలోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, గిద్దె పెరమాండ్ల దేవాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శమీపూజల్లో పాల్గొన్నారు. మార్క్‌ఫెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాంలీలాకు మంత్రి, ఎమ్మెల్యే హాజరయ్యారు. చైతన్యపురి మహా శక్తి దేవాలయంలో మంగళవారం రాత్రి అమ్మవారి నిమజ్జనం వైభవంగా జరిగింది. హుజూరాబాద్, చొప్పదండిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీలో జరిగిన దసరా, అమ్మవారి పూజల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, సీపీ గౌస్ ఆలం, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– కరీంనగర్‌కల్చరల్/హుజూరాబాద్/చొప్పదండి
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పలుచోట్ల మండపాలు, వివిధ ఆలయాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు బుధవారం నేత్రపర్వంగా సాగింది. ఉద్వాసన పూజల అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కార్యకర్తలు, భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారి మూర్తులను వివిధ వాహనాల్లో మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట, చెరువులకు తరలించారు. టవర్ సర్కిల్‌లో వ్యాపారులు కేరింతలు, ఈలలు కొడుతూ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఆకాశాన తారాజువ్వలు, టపాసుల వెలుగులు విరజిమ్మాయి. – కరీంనగర్‌కల్చరల్


