సాక్షిప్రతినిధి,కరీంనగర్:
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. పండుగ వారం రోజుల్లోనే మద్యం ప్రియులు రూ.33.68 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఈ వ్యవధిలో 30,450 లిక్కర్ పెట్టెలు, 60,740 బీర్ పెట్టెలు అమ్ముడైనట్లు సమాచారం. పండుగ వేళ వైన్స్‌ల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది.
పండక్కి ముందస్తు నిల్వలు...
బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని వైన్స్ నిర్వాహకులు ముందుగానే భారీగా మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయంలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాతో లిక్కర్, బీర్లను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచారు. దసరా రోజున మద్యం కొనుగోళ్లు పెరగడంతో సాయంత్రం వరకే స్టాక్ దాదాపుగా ఖాళీ అయినట్లు సమాచారం. జిల్లాలో 94 వైన్ షాపులు ఉండగా పండుగ సందర్భంగా ఫుల్‌గిరాకీ జరిగినట్లు తె లుస్తుంది.
చల్లని బీర్ల కోసం ఎదురుచూపులు...
జిల్లాలోని మానకొండూరు, హుజూరాబాద్, శంకరపట్నం, గంగాధర ప్రాంతంలోని వైన్స్‌లలో సాయంత్రం సమయానికి బీర్ల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో చల్లని బీర్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు మద్యం ప్రియులు సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న బీర్లతోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. పండుగ వేళ బీర్లకు పెరిగిన డిమాండ్ వైన్స్ నిర్వాహకులకు సైతం సవాలుగా మారింది. మొత్తంగా బతుకమ్మ, దసరా పండుగలు మద్యం వ్యాపారానికి కలిసిరాగా, వారం రోజుల్లోనే రూ.33.68 కోట్ల విక్రయాలు జరగడం విశేషం. పండుగల సమయంలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


