కరీంనగర్‌క్రైౖం: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కొనియాడారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అంకితభావంతో సేవలందించడమే నిజమైన నివాళి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ ఆలం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం అదనపు డీసీపీ వెంకటరమణ విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల వివరాలు చదివి వినిపించారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లల విద్యాభివృద్ధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ దేశ సమగ్రత, అంతర్గత భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈనెల 31 వరకు కార్యక్రమాలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 21 నుంచి 31 వరకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రక్తదాన శిబిరాలు, ఓపెన్‌హౌస్, వ్యాసరచన, లఘుచిత్రాల పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.


