వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వేములవాడ శాఖ సిబ్బంది సుమారు రూ.45 వేల విలువైన లాకర్‌ను ఈవో రమాదేవికి శుక్రవారం అందజేశారు. ఆలయ పీఆర్వో పెరుక శ్రీనివాస్, అకౌంట్ అడ్వయిజర్ ఆగమరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలు
వేములవాడ: వేములవాడకు చెందిన నలుగు రు యువకులు ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. వేములవాడకు చెందిన చందు, రాకేశ్, గౌతమ్, కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వృద్ధురాలి మృతి
రామగుండం: ఐవోసీ ఇందిరమ్మకాలనీ వద్ద రాజీవ్ రహదారిని శుక్రవారం రాత్రి బద్రిపల్లి గ్రామానికి చెందిన నాంసాని భూదమ్మ(80) రోడ్డు దాటుతోంది. కరీంనగర్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు.
విద్యుత్ కంచె తాకి రైతు..
రుద్రంగి(వేములవాడ): పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఓ రైతు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లానాయక్ తండాలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. వన్యప్రాణుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి రూప్లానాయక్‌తండాకు చెందిన రైతు భూక్య చందర్(52) శుక్రవారం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని రుద్రంగి ఎస్సై మోతీరాం పరిశీలించి శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మట్టి వాహనాలు సీజ్
పాలకుర్తి: పాలకుర్తి మండలం కన్నాల బోడగుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలు, ఒక పొక్లెయిన్‌ను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. తహసీల్దార్ సునీత హాధ్వర్యంలో ఆర్‌ఐ సంతోష్, జూనియర్ అసిస్టెంట్ మల్కారెడ్డితో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లోడ్‌చేస్తున్న ఒక పొక్లెయిన్, రెండు లారీలు సీజ్‌చేసి బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
డీజే నిర్వాహకుల బైండోవర్
పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో డీజే వినియోగించవద్దంటూ పోలీసులు డీజే నిర్వాహకులను శుక్రవారం పెద్దపల్లి తహసీల్దా ర్ రాజయ్య ఎదుట బైండోవర్ చేశారు. నవరాత్రోత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై నరేశ్ కోరారు.
హెడ్ మాస్టార్‌పై కేసు
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ సబ్ ట్రెజరీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌ను బెదిరించిన జూలపల్లి మండలం కుమ్మరికుంట హైస్కూల్ హెచ్‌ఎం మహేశ్‌పై గురువారం కేసు నమోదు చేసిన విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. హెచ్‌ఎం మహేశ్ గురువారం సుల్తానాబాద్‌లోని సబ్ ట్రెజజరీ అఫీస్‌కు వచ్చి తన స్కూల్ బ్యాంక్ అకౌంట్స్‌ను ఎందుకు తిరస్కరించారని అడిగారు. సరైన పత్రాలు సమర్పించలేకపోవడంతో తిరస్కరించినట్లు సీనియర్ అకౌంటెంట్ చెప్పినా వినకుండా ‘నీ అంతు చూస్తా’ అని భయబ్రాంతులకు గురిచేశారు. సీనియర్ అకౌంటెంట్ భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
విదేశాల్లో ఉపాధి అవకాశాలు
విద్యానగర్(కరీంనగర్): తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నమోదిత రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అర్హత, నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 18న పేర్ల నమోదు కార్యక్రమం కరీంనగర్‌లోని నెహ్రూ యువకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. వివరాలకు www. tomcom. telangana. gov. in వెబ్‌సైట్ లేదా 080 35524946 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


