● జాడలేని భర్త.. కడసారి చూపునకు నోచుకోని వైనం ● మనవడి చితికి తాత.. తల్లి చితికి పెద్ద కొడుకు నిప్పు ● చిన్నాభిన్నమైన కుటుంబం
మల్యాల: ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు ఆ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేశాయి.. నిన్నటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ.. నిత్యం పాఠశాలకు ఆలస్యం అవుతుందంటూ ఉదయమే నిద్రలేపే అమ్మ జాడ కానరావడం లేదు. తమ్ముడి అల్లరి వినపడడం లేదు. నెల రోజుల క్రితం ఉపాధి పేరిట ముంబయి వెళ్లిన తండ్రి జాడ లేదు. ఓ మూలకు తాత.. మరో మూలన పదకొండేళ్ల మనుమడు.. తల్లి చితికి పెద్ద కొడుకు నిఖిలేశ్, మనువడు శశాంక్ చితికి తాత నిప్పు పెట్టిన విషాదకర ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాలకు చెందిన గుండేటి కవిత(36) ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో కుమారుడితోపాటు ఈ నెల 10న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసైన భర్త ఒకవైపు.. సుమారు రూ.20లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే మార్గం కానరాక చిన్న కుమారుడితోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది.
కడసారి చూపునకు నోచుకోని వైనం
కుమారుడు శశాంక్‌తో సహా భార్య కవిత ఆత్మహత్య చేసుకోగా, భర్త గుండేటి దశరథం చివరి చూపునకు కూడా నోచుకోలేదు. మద్యానికి బానిసై న దశరథం కొంతకాలం గ్రామంలో పనిచేసి, ఉపాధి కోసం ముంబయి వెళ్లాడు. ఇప్పటి వరకు అతడి జాడలేదు. కవిత ఆత్మహత్య సమాచారాన్ని బంధువుల ద్వారా ముంబయిలో దశరథంకు చేరవేసేందుకు ప్రయత్నించగా అక్కడ లేడని తేలింది.
24గంటల తర్వాత మృతదేహం లభ్యం
ఆత్మహత్య చేసుకున్న కవిత మృతదేహం లభ్యం కాగా, చిన్నారి శశాంక్(7) మృతదేహం కోసం 24గంటలపాటు బావిలో మోటార్లు ఆన్ చేసి, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. శుక్రవారం వేకువజామున శశాంక్ మృతదేహం లభ్యమైంది. తల్లి చితికి పదకొండేళ్ల కొడుకు, శశాంక్ చితికి తాత పండిత్ నిప్పంటించారు. తల్లీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


