● భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ● ముంపు గ్రామాల్లో ఫ్యాక్టరీలు అవసరం ● వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
గోదావరిఖని/వేములవాడ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ గళం వినిపించారు. మిడ్‌మానేరు నిర్వాసిత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరగా.. తమ నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు.
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ, ఇతర పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. పరిశ్రమలు, ఐటీ రంగాల స్థాపనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కింద వేములవాడ పరిసరాల్లో సుమారు 12 గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంపు గ్రామాలను సందర్శించి సమస్యలు పరిశీలించారని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపనకు సరిపడా స్థలంతోపాటు జలాశయం ద్వారా అవసరమైన నీటి లభ్యత ఉందని సభ దృష్టికి తెచ్చారు.
గల్ఫ్ వలసలకు అడ్డుకట్ట
ఈ ప్రాంతం నుంచి ఉపాధి వెతుక్కుంటూ యువత భారీసంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పితేనే వలసలను శాశ్వతంగా నివారించవచ్చని విప్ విజ్ఞప్తి చేశారు. మహిళలకు అత్యాధునిక కుట్టు శిక్షణ కేంద్రాలను సిరిసిల్ల అపారెల్ పార్కు తరహాలో ఆధునిక హంగులతో షెడ్లను ఏర్పాటు చేసి యువతులు, మహిళల కోసం అత్యాధునిక కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. తద్వారా షర్టులు, ప్యాంట్లు, కుర్తాల తయారీ వంటి రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి చేకూరుతుందని వివరించారు. ఈ ప్రాంత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయండి..
రామగుండం నియోజకవర్గంలోని యువత ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిపై అసెంబ్లీలో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ఇండస్ట్రియల్ బెల్ట్ అని, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా పేరుగాంచిందన్నారు. 800 మెగావాట్ల పవర్‌ప్లాంట్ పెట్టాలని, ఇందుకోసం 1,800 ఎకరాలను రైతుల నుంచి సేకరించి ఇచ్చారని అన్నారు. వారితో మాట్లాడి పరిశ్రమలు పెట్టాలని, లేనిపక్షంలో ఆ భూమిని వాపస్ తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు, విద్యుత్, నీళ్లు అన్నీ ఉన్న ప్రాంతమని, అంతర్గాంలో 500ఎకరాలు, రాయదండిలో 500ఎకరాలు, బసంత్‌నగర్‌లో వంద ఎకరాలు ఉన్నాయని, ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్‌పోర్టు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, కానీ ఫిజిబిలిటీ రిపోర్టు రాలేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘మన జిల్లా.. మన ఊరు’ విషయాన్ని గుర్తించి ఐటీమంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకోవాలని స్పీకర్ ద్వారా కోరారు.


