● కొండాపూర్‌లో విషాదం
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్‌లో ఆరు నెలల గర్భిణీ హారిక(25) మృతితో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మల్యాల ప్రభాకర్–లక్ష్మి దంపతుల పెద్ద కూతురు హారికకు ఎనిమిది నెలల క్రితం కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ. వైద్యపరీక్షల కోసం ఇటీవల సిరిసిల్ల బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. గర్భంలో శిశువు ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శిశువును తొలగించారు. అనంతరం హారిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనలతో బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి హారిక మృతిచెందింది. భర్త బతుకుదెరువు కోసం గల్ఫ్‌లో ఉండగా, పెళ్లయిన ఎనిమిది నెలలకే హారిక అనంతలోకాలకు వెళ్లడంతో కొండాపూర్, రామకృష్టాపూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండాపూర్‌లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.


