● జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
కోల్‌సిటీ: రోడ్డు ప్రమాదంలో ముఖం, దవడ ఎముకలు ఛిద్రమైన ఓ వ్యక్తికి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వైద్యులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తిలో వ్యవసాయం చేసుకునే జీడి సదానందం గతనెల 30న రాత్రి జమ్మికుంట సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జమ్మికుంట, హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఈనెల 2న స్థానిక జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు.
‘లీ ఫోర్ట్–3 బైలాటరల్ ఫ్రాక్చర్’
సదానందం ‘లీ ఫోర్ట్–3 బైలాటరల్ ఫ్రాక్చర్’కు గురయ్యాడని దంతవైద్య బృందం గుర్తించింది. డెంటల్ హెచ్‌వోడీ సుమలత ఆధ్వర్యంలో ఈనెల 9న మాక్సిల్లోఫేషియల్ సర్జన్ డాక్టర్లు శ్రవణ్ తేజ, లహరి, నైనా, అనెస్థీషియా హెచ్‌వోడీ భానులక్ష్మి, డాక్టర్లు రాజేశ్వరి, కరుణాకర్‌తో కలిసి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
అరుదైన విధానంతో ఆపరేషన్..
బాధితుని ముఖం, దవడ ఎముకలు విరగడంతో సాధారణ పద్ధతిలో శ్వాసనాళంలో ట్యూబ్ అమర్చడం సాధ్యం కాలేదు. దీంతో అనెస్థీషియా, డెంటల్ వైద్యులు ‘సబ్‌మెంటల్ ఇంట్యూబేషన్’ అనే అరుదైన విధానాన్ని ఉపయోగించి గడ్డం కింద నుంచి శ్వాస ట్యూబ్ అమర్చారు. నాణ్యమైన ఇంప్లాంట్లతో ముఖ ఎముకలను పునర్నిర్మించి, రెండు వైపులా విజయవంతంగా ఫిక్స్ చేశారు. సదానందం కోలుకోవడంతో శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన వైద్యుల సేవలను జీవితాంతం మచ్చిపోలేమంటూ బాధితుడు, అతడి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, ఆర్‌ఎంవో కృపాబాయి అభినందించారు.


