పెద్దపల్లి: ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులతో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్యామ్ ఉరివేసుకుని మృతి చెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం స్థానిక ఫైనాన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. శ్యామ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.70 వేల అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాయిదాలను సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు. ఈనెల కూలి సరిగా లభించక వాయిదా సకాలంలో చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ నిర్వాహకులు ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ మానసికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్యామ్ ఉరివేసుకుని ఆత్మహత్య చెందాడు. ఆగ్రహించిన గ్రామస్తులు పెద్దపల్లికి చేరుకుని ఫైనాన్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు అప్పటికే కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. శ్యామ్‌కు ఇద్దరు సంతానం. అతడి మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రుణవసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


