కరీంనగర్: మెట్‌పల్లి పట్టణంలోని బస్‌డిపో చౌరస్తాలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. చౌరస్తాలో ఆమెను కొట్టాడు. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన అర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌ను దూషించాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
35 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్
కరీంనగర్: వినాయక ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని 35మంది డీజే ఆపరేటర్లను మెట్‌పల్లి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా మండపాల వద్ద డీజేలను ఏర్పాటు చేయొద్దని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులపై కేసు
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో జరిగిన రూ.32లక్షల గోల్‌మాల్ విషయంలో ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదైంది. బల్దియా నిధులు మళ్లించి, అక్రమాలకు పాల్పడ్డారని నోటీసులు అందుకున్న సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ నుంచి నుంచి రూ.8,14,401, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బోళ్ల సదానందం నుంచి రూ.10,75,527 రికవరీ చేయాలని సీడీఎంఏ ఆదేశాలు అందాయి. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జునస్వామి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులు నిధులు కాజేసినట్లు నిరూపణ కాగా.. ఇద్దరిపైనే కమిషనర్ ఫిర్యాదు చేయడంపై పట్టణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


