ఐఎఫ్‌ఏటీ ప్రదర్శనకు బల్దియా కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఏటీ ప్రదర్శనకు బల్దియా కమిషనర్‌

Sep 9 2026 11:40 PM | Updated on Sep 9 2026 11:40 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన, వ్యర్థాల నిర్వహణను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ముంబా యిలో జరుగుతున్న ఐఎఫ్‌ఏటీ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో నీటి నిర్వహణ, వ్యర్థాల రీసైక్లింగ్‌, పర్యావరణ సాంకేతిల్లో వస్తున్న వినూత్న మార్పులను పరిశీలించారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రదర్శనలో లభించే సాంకేతిక పరిష్కారాలు ఏ విధంగా ఉపయోగపడుతాయో వివిధ దేశాల ప్రతిని ధులతో చర్చించారు. తాగునీటి సరఫరా వ్యవస్థను డిజిటలైజ్‌ చేయడం, మురుగునీటి శుద్ధి(ఎస్‌టీపీ), జలవనరుల పునరుద్ధరణకు ఆధునిక పద్ధతులను తెలుసుకున్నారు. అధునాతన స్వీపింగ్‌ యంత్రాలు, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించారు.

12న జాతీయ లోక్‌ అదాలత్‌

కరీంనగర్‌ క్రైం: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి యశ్వంత్‌ సింగ్‌ తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌ కేసులతో పాటు కుటుంబ తగాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహారం, బ్యాంకు, చిట్‌ఫండ్‌ తదితర కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. కేసుల్లో రాజీ చేసుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు, న్యాయవాదులు లేదా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సత్వర న్యాయం, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లో ఇప్పటివరకు 2,600 క్రిమినల్‌ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

రేపు రైస్‌ మిల్లర్ల ధర్నాకు పిలుపు

కరీంనగర్‌ అర్బన్‌: రైస్‌మిల్లులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయని, భరోసాగా ఉండాల్సిందిపోయి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించడం విడ్డూరమని రైస్‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి బోనగిరి శశికిరణ్‌ ఆరోపించారు. సాధ్యంకాని నిబంధనలను విధిస్తూ మెడపై కత్తి పెట్టడం తగదని బుధవారం కలెక్టర్‌ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం నిర్ణయం మేరకు బుధవారం నుంచి మిల్లులను మూసివేశామని వివరించారు. రబీ ధాన్యం బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే అనుకూలంగా ఉండటం, అధిక నూకలు/డ్యామేజ్‌, ధాన్యం షార్టేజ్‌, ఎఫ్‌సీఐ స్థలాభావం, బాయిల్డ్‌ రైస్‌ నిల్వ సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. తక్షణమే రైస్‌మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రబీ, ఖరీఫ్‌ ధాన్యం పూర్తయ్యే వరకు ఫిజికల్‌ వెరిఫికేషన్‌, షార్టేజ్‌ ఆధారిత చర్యలను నిలిపివేయాలని కోరారు. ఎఫ్‌సీఐ వద్ద అదనపు స్టోరేజీ స్థలం కేటాయించి, మిల్లులో నిల్వ ఉన్న బాయిల్డ్‌ రైస్‌ను ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా త్వరితగతిన తీసుకోవాలని కోరారు. ప్రతి మిల్లుకు నిర్ధారిత బాయిల్డ్‌ రైస్‌ కోటా కేటాయించి మిల్లింగ్‌ నిరంతరాయంగా కొనసాగించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని డి మాండ్‌ చేశారు. శుక్రవారం రైస్‌మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు శాంతియుత ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు.

పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి

విద్యానగర్‌(కరీంనగర్‌): పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నెలరోజుల పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆశ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామైక్య సంఘాల సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు భాగస్వామ్యం కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement