మిల్లర్ల అక్రమాలకు ముకుతాడు | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల అక్రమాలకు ముకుతాడు

Sep 9 2026 11:40 PM | Updated on Sep 9 2026 11:40 PM

మిల్లర్ల అక్రమాలకు ముకుతాడు ● ఇక ధాన్యంపై పక్కా నిఘా ● భౌతిక పరిశీలన.. యాప్‌లో నమోదు

కరీంనగర్‌ అర్బన్‌: మరాడించి ఇవ్వాల్సిన ధాన్యాన్నే మాయం చేస్తున్న కేటుగాళ్లకు చెక్‌ పడనుంది. పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులకు జిల్లాలో కొదువ లేదు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని అప్పనంగా అమ్ముకుని పదులు, వందల కోట్లకు ఎదిగినవారు లేరంటే అతిశయోక్తి కాదేమో. సర్కార్‌ సొమ్మును విలువైన భూములు, ఖరీదైన విల్లాలు, వ్యాపారాలకు మళ్లించినవారెందరో. ఈ క్రమంలో ధాన్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) అందించేందుకు ప్రభుత్వం ఏటా మిల్లులకు కేటాయిస్తోంది. సదరు ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉన్నప్పటికీ వారు సృష్టించుకున్న కారణాలతో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలువురు మిల్లర్లు ఇచ్చిన ధాన్యం దుర్వినియోగం చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మిల్లులకు అందించిన భౌతిక లెక్కింపు (ఫిజికల్‌ కౌంటింగ్‌)ను చేపట్టేలా చర్యలు తీసుకోనుంది.

మిల్లులే ఉండవు.. బియ్యం కేటాయింపులు

జిల్లాలో సీఎంఆర్‌ వ్యవహారం దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా మారింది. మిల్లులు నడపకున్నా బియ్యం కేటాయింపులు చేసుకోవడం, వచ్చే వందల టన్నుల ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కరీంనగర్‌, జమ్మికుంట, హుజూరాబాద్‌, తిమ్మాపూర్‌, మానకొండూరు, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో విజిలెన్స్‌,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు కోకొల్లలు. మిల్లుల్లో అసలు ధాన్యమే లేకపోగా రూ.100కోట్ల వరకు కొల్లగొట్టిన ఘనులున్నారు. గడువులోగా అందించకుండా గడువులు పొడిగించుకోవడం, రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్‌గా అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోనే రూ.వేయి కోట్ల వరకు విలువ గల ధాన్యం పక్కదారి పట్టిందని సమాచారం. కొన్ని మిల్లుల్లో చూద్దామన్నా.. ధాన్యం కనిపించకపోగా, మరికొన్నిచోట్ల నిల్వల్లో భారీగా తేడాలు ఉండటంతో గడువులోపు ధాన్యం అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వమే పలుమార్లు గడువులు పెంచుతూ వెళ్లినా.. లక్ష్యం చేరుకోవడం లేదు.

ఎవరెక్కడో అధికారులకే తెలియదు

సీఎంఆర్‌కు సంబంధించి ప్రతి బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో మిల్లులకు వెళ్లి ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేయనున్నారు. మిల్లుకు కేటాయించిన ధాన్యమెంత? నిల్వ ఉన్న బస్తాలెన్ని? మరాడించిన బియ్యం ఎంత అందించారు? కేటాయించిన ప్రకారం నిల్వలున్నాయా? తదితర వివరాలను పరిశీలించి పౌరసరఫరాలకు చెందిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు. తనిఖీలకు ఒకరోజు ముందు సాయంత్రం ఏ మిల్లుకు ఏ అధికారి వెళ్లాలనేది పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ నుంచి సందేశం రానుంది. ఈ మేరకు డీసీఎస్వో, డీఎం, ఏసీఎస్‌వో, గిర్దావర్‌ తదితర అధికారులు సంబంధిత మిల్లుకు వెళ్లి పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. అదేవిధంగా సదరు అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనపై జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఏవైనా పొరపాట్లుంటే సదరు అధికారులపై వేటు వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement