కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన ఓ వితంతువు చేయూత ఫించన్ కోసం దరఖాస్తు చేసింది. ఓ రాజకీయ నేతను కలవగా రూ.20వేలు ఖర్చవుతుందని చెప్పాడు. కూలీ పనులు చేసుకునేదాన్ని అంతగా ఇచ్చుకోలేనని చెప్పడంతో తానేం చేయలేనని, అధికారులకు ఇస్తేనే పనవుతుందని ఖరాకండిగా చెప్పేశాడు. చేసేదిలేక అప్పు చేసి రూ.20వేలు అతని చేతిలో పెట్టింది.
హుజూరాబాద్ సమీప గ్రామానికి చెందిన దివ్యాంగుడు పింఛన్‌కు దరఖాస్తు చేశాడు. సదరం సర్టిఫికెట్‌లో 55శాతం ఉండగా ఇక పింఛన్ వస్తుందని ఆశించాడు. ఓ దళారీ రంగ ప్రవేశం చేసి పింఛన్ రావాలంటే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిబంధనల ప్రకారం అర్హుడినే కదా అంటే నిబంధనలు కాదు.. చేతులు తడిపితేనే పనవుతుందంటూ మాటల గారడీ చేశారు. దీంతో ఎంతో కొంత ముట్టజెప్పాడు.
కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్ల విషయంలో దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు వురు రాజకీయ నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికార పార్టీ నేతలు ఈ దందాలో దిగడం గమనార్హం. ఒంటరి మహిళ, వితంతు, చేనేత, గీత, బీడీ కార్మిక, దివ్యాంగుల వారీగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ అర్బన్‌తో పాటు 16 మండలాలుండగా ఇప్పటికి 10వేలకు పైగా అర్జీలు రాగా తమవారికి పింఛన్లు మంజూరు చేయాలంటూ కొందరు వైట్‌కాలర్ లీడర్లు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
అర్హులకే దక్కేనా?
చేయూత దరఖాస్తుల్లో అత్యధికం కూలీ పనులు చేసుకొని సాగించే ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయి కుటుంబ భారాన్ని మోస్తున్న వితంతువులు, రెక్కాడితే గానీ డొక్కాడని కల్లు గీతాకార్మికులు, బీడీలు చుడితే గానీ పూట గడవని మహిళలున్నారు. కుటుంబ అవసరాలకు కొంతైనా ‘చేయూత’ లభిస్తుందని భావిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు నాయకులు దరఖాస్తుదారుల అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బేరసారాలకు దిగుతున్నారు. పలుకుబడితో పింఛన్ మంజూరు చేయిస్తామంటూ నమ్మబలుకుతున్నా రు. రూ.10వేల నుంచి రూ.50వేలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి అవకతవకలకు తావులేకుండా పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు గత నెల 31తో గడువు ముగి యగా ప్రభుత్వం ఈ నెల 15 వరకు పెంచింది.
వయోపరిమితి లేదు.. ప్రతి అర్జీ ఆన్‌లైన్
గ్రేడ్–2, గ్రేడ్–3 ఫైలేరియా బాధితులు, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. వీరిని సంబంధిత వైద్య, ఆరోగ్యశ్రీ విభా గాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హులైనవారు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో, వార్డు అధికారి లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 15 తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పరిశీలన, విచారణ పూర్తయిన తర్వాత ఈ నెలాఖరులో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికీ పైసా ఇవ్వొద్దు
పింఛన్ల జారీ ప్రక్రియ పారదర్శఽకంగా ఉంటుందని, ఎవరికి పైసా ఇవ్వకూడదని డీఆర్డీవో అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్నవారికి చేయూత పథకం అందుతుందని స్పష్టం చేస్తున్నారు.


