పథకం ప్రకారమే బీఆర్‌ఎస్‌ డ్రామా | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే బీఆర్‌ఎస్‌ డ్రామా

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ముందుగా వేసుకున్న స్కెచ్‌ ప్రకారమే బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎదుట డ్రామాలు చేస్తోందని మున్నూరుకాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి విమర్శించారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు లింగంపల్లి బాబుతో కలిసి మాట్లాడారు. దళితుడైన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను అసభ్యపదజాలంతో దూషించడం, బీఆర్‌ఎస్‌ దళిత వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుందన్నారు. గతంలో దళితుడైన భట్టివిక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా చేసేందుకు పార్టీని చీల్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌దన్నారు. రెండో రోజు కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే అహంకారంతో వ్యవహరించడం వారి స్వభావాన్ని తెలియజేస్తోందన్నారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, కేసీఆర్‌ దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. కార్పొరేటర్‌ వరాల నరసింగం, నగర కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు అహమ్మద్‌ అలీ, జీడీ రమేశ్‌, చింతల కిషన్‌, మాదాసు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

కరీంనగర్‌: జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు సూచించారు. మంగళవారం పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించించారు. ఐవీఎఫ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌, పీసీ పీఎన్‌డీటీ చట్టం అమలు, డీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ అంశాలను పరిశీలించారు. ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు, ఐవీఎఫ్‌ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, అనుమతులు కలిగి ఉండాలని సూచించారు. పీసీ పీఎన్‌డీటీ చట్టం నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రైవేట్‌ ఆసుపత్రుల బాధ్యత అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సంబంధిత చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలని, రిజిస్ట్రేషన్లు సక్రమంగా కొనసాగించాలని ఆదేశించారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడించిన రైతులు

చిగురుమామిడి: చిగురుమామిడి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు ముట్టడించారు. పగటిపూట త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, పొలాలు ఎండిపోతున్నాయని మందుడబ్బాలతో ఆందోళనకు దిగారు. రోజుకు 12గంటల విద్యుత్‌ అందించాల్సి ఉండగా ఏడు నుంచి ఎనిమిది గంటలకు కూడా సరిగా ఇవ్వడం లేదని, సాంకేతిక కారణాల పేరుతో కోత విధించడంతో నష్టపోతున్నామని ఇన్‌చార్జి ఏఈ అన్వేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేశ్‌, బొమ్మనపల్లి, చిగురుమామిడి ఉపసర్పంచ్‌లు కాసర్ల హరీశ్‌, కాశబోయిని విజయలక్ష్మి, ముక్కెర సదానందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement