కరీంనగర్ కల్చరల్/కరీంనగర్ అర్బన్: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. సెప్టెంబర్ 23న నిమజ్జనోత్సవం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చవితి నుంచి నిమజ్జనం వరకు పోలీస్, మున్సిపల్, విద్యుత్, వైద్య, రెవెన్యూ అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి మండపం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద బారికేడ్లు, క్రేన్లు, మెడికల్ క్యాంపులు, 108 వాహనాలు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, బోట్లు, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. శోభాయాత్ర మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, లూజ్‌వైరింగ్ సరిచేయడం వంటి పనులు ముందే పూర్తి చేయాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్‌లోని విగ్రహాలను మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్య తలెత్తిన వెంటనే స్పందించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్, యాదగిరిస్వామి, డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు, డీపీవో జగదీశ్వర్, మత్స్యశాఖ అధికారి విజయభారతి, గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కే.మహేశ్వర్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ..
కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (రెవెన్యూ), వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోదాం వద్ద సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు, ఫైర్ సేఫ్టీ తదితర వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాం తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


