కరీంనగర్ అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని టీఎన్జీవోల భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సన్నాహక సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలులో అధికారుల నిర్లక్ష్యంతో పురోగతి కనిపించడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ నేతలు లింగారెడ్డి, కటకం రమేశ్, స్తిత ప్రజ్ఞ, వెంకట్, సదానందం గౌడ్, శ్యాం, దామోదర్‌రెడ్డి, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకురి శంకర్, సిరిసిల్ల అధ్యక్షులు ప్రవీణ్, జగిత్యాల అధ్యక్షులు నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


