జ్యోతినగర్: చదువుపై ఆందోళనతో ఇంటర్ విద్యార్థి అయాన్ ఖాన్ (17) మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న అంజత్‌ఖా న్ కుటుంబం ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అయాన్‌ఖాన్ మానసిక వ్యథతో ఉరేసుకుని మృతి చెందాడు. చదువుపై ధ్యాస కుదరడం లేదనే ఆందోళనతో మానసికంగా ఇబ్బందికి గురైనట్లు మృతుడి తండ్రి అంజద్‌ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బైక్ దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కమలాకర్ తన ద్విచక్ర వాహనాన్ని గతనెల 17న ఇంటి ముందు పార్క్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై కుమారస్వామి కేసు దర్యాప్తు చేపడుతుండగా.. సోమవారం మధ్యాహ్నం విద్యానగర్ బైపాస్‌రోడ్ నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని రాయికల్ మండలం వీరాపూర్‌కు చెందిన షేక్ జమీల్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
మద్యం మత్తులో వీరంగం
పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. పెద్దపల్లిలోని చీకురాయి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న హోటల్ యజమానితో మత్తులో ఉన్నయువకులు గొడవకు దిగి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న గాజుపెంకులు కోసుకుపోయి తీవ్రరక్తస్రావమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎలాగోలా వారిని పోలీసు వాహనంలోనే ఎక్కించి జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనూ ఓ యువకుడు మత్తులో హల్‌చల్ చేసి వైద్యపరికరాలను చిందరవందర చేశాడు. పోలీసులు అదనపు సిబ్బందిని పిలిపించి వైద్యం చేయించారు. నిందితులను సుల్తానాబాద్‌కు చెందిన హరీశ్, లక్ష్మణ్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
సెల్ టవరెక్కి ఆందోళన
గన్నేరువరం: తన భూ సమస్య పరిష్కరించాలని చాకలివానిపల్లె శివారులోని కూనవానిపల్లెకు చెందిన కూన సతీశ్ సోమవారం గన్నేరువరంలోని సెల్‌టవర్ ఎక్కాడు. తనస్థలంలో ఇళ్లు నిర్మించుకుంటే మల్లయ్య అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని రెండు నెలలుగా అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సతీశ్ టవర్ దిగాడు. టవర్ ఎక్కిన కూన సతీశ్‌తో పాటు అదే సమస్యపై పురుగుల మందు తాగుతానని బెదిరించిన కూన మల్లయ్యను తహసీల్దార్ నరేందర్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.
ఎలుగుబంటి సంచారం
గన్నేరువరం: గునుకుల కొండాపూర్‌లో ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదివారం రాత్రి మిడ్‌మానేరు ప్రాజెక్టు కుడి కాలువ సమీపంలోని బూట్ల సంపత్ వ్యవసాయ భూమి వద్ద ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్తుల తెలిపారు. దీంతో పొలాలు వద్దకు రైతులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరుగకముందే ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సీపీకి ఫిర్యాదు
కరీంనగర్‌క్రైం: తనను కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగంపల్లి సత్యనారాయణ సీపీకి ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన గంగారెడ్డిపై వన్‌టౌన్‌లో కేసు నమోదైందని, వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.


