రామగుండం: జమ్మికుంట–పొత్కపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పనులకు అంతరాయం కలుగకుండా ఈనెల 10న కాజీపేట–సిర్‌పూర్‌టౌన్(17003), బల్హర్షా–కాజీపేట(17004) మధ్య ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. బల్హర్షా–భద్రాచలంరోడ్డు మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును వరంగల్ వరకు, హైదరాబాద్–సిర్‌పూర్ కాగజ్‌నగర్ రైలును కాజీపేట వరకు, సిర్‌పూర్ కాగజ్‌నగర్–బీదర్ రైలును కాజీపేట వరకు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు సికింద్రాబాద్–సిర్‌పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్(17233), సిర్‌పూర్‌టౌన్–కరీంనగర్(67771), కరీంనగర్–బోధన్(67773) రైలు గంట ఆలస్యంగా నడిపించనున్నారు.
విగ్రహాలు ధ్వంసం
ఇల్లందకుంట: మండలంలోని సిరిసేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వరయ్య ఆలయంలో విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రజకులు ఆదివారం ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పురాతన మడలేశ్వరయ్య ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో మూడేళ్ల క్రితం నూతన ఆలయం నిర్మించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎజ్జ.రాజయ్య, ఆలేటి గణేశ్, కొమర్రాజు చిరంజీవి, రాము, తిరుపతి, గాజా సాయికృష్ణ పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. కాపర్‌వైర్ చోరీ
జమ్మికుంట: మండలంలోని గండ్రపల్లి శివారులో గుర్తు తెలియని దొంగలు శనివారం రాత్రి పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన ఐదు 25 హెచ్‌బీ టాన్స్‌ఫార్మర్లు ధ్వంసం, కాపర్‌వైర్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు గమనించారు. సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
తాళం వేసిన ఇంట్లో..
● 9 గ్రాముల బంగారం, రెండు తులాల వెండి అపహరణ
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్భన్ మండలం ధరూర్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నాగిశెట్టి రేవతి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా దొంగలుపడ్డారు. మరో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రేవతి ఇంట్లో నుంచి 9 గ్రాముల బంగారం, రెండు తులాల వెండి, ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆర్‌ఐ (అడ్మిన్) కిరణ్‌కుమార్ సస్పెన్షన్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ సీవీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు సిబ్బంది డ్యూ టీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతోపాటు కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
వివాహిత ఆత్మహత్య
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన వివాహిత బోయిన అరుణ(34) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు. అరుణ అత్తగారిల్లు, తల్లిగారిల్లు రెండు చీర్లవంచ గ్రామమే కావడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారింట్లో ఉంటుంది. భర్త శంకర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. కొద్దికాలంగా అరుణ మాససిక సమస్యలతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


