ఆధ్యాత్మిక వలయం
ప్రభుత్వం ఊతమిస్తే పర్యాటకాభివృద్ధి
మిడ్‌మా‘నీటి’లో దత్తాత్రేయ ఆలయం భక్తులకు అందుబాటులో బోటు వేములవాడ.. నాంపల్లిగుట్ట.. మిడ్‌మానేరు డ్యామ్ ప్రకృతి అందాల మధ్య పర్యాటక శోభ
జలసోయగం..
మా‘నీటి’లో దత్త ఆలయానికి బోటు ప్రయాణం
ఫోర్ లేన్ బ్రిడ్జి
వరదవెల్లి గుట్టపై దత్తత్రేయస్వామి ఆలయం
బోయినపల్లి(చొప్పదండి): కనుచూపు మేరలో చుట్టూ మా‘నీరు’. మధ్యలో గుట్ట.. దానిపై వెలసిన దత్తాత్రేయ ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుంది. ఈ ప్రకృతి కమనీయ దృశ్యం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విరాజిల్లుతోంది. వరదకాలువను ఆనుకుని ఓ వైపు పచ్చని పొలాలు.. మరో వైపు విశాలమైన మిడ్‌మానేరు.. ఇంకోవైపు విలాసాగర్ త్రిలింగసంగమేశ్వరుడు కొలువుదీరిన నేల రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రాంతం. నీటి అందాల మధ్య భక్తి విరాజిల్లుతోంది.
రెండు జిల్లాల మధ్యలో..
రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ బోయినపల్లి మండలం మాన్వాడ–కొదురుపాక సరిహద్దుల్లో మానేరునదిపై మిడ్‌మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో మండలంలోని వరదవెల్లిగుట్టపై స్వయంభూగా దత్తాత్రేయ స్వామి వెలిశారు. మిడ్‌మానేరులో నీరు చేరిన సమయంలో భక్తులు దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్లేందుకు బోటును అందుబాటులో ఉంచుతున్నారు.
అందమైన హైలెవల్ బ్రిడ్జి
మానేరునదిపై మూడు కిలోమీటర్ల మేర నిర్మించిన పాత శాభాష్‌పల్లి పరిసరాల్లో ఇప్పుడు (కొదురుపాక) ఫోర్‌లేన్ రోడ్డులో ఉన్న హై లెవల్ బ్రిడ్జి నీటి మధ్యలో ఆకట్టుకుంటుంది.
జీవకళకు ప్రతిరూపాలు ముంపు గ్రామాలు
మిడ్‌మానేరు నిర్మాణంతో బోయినపల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి ముంపునకు గురయ్యాయి. మిడ్‌మానేరు బ్యాక్ వాటర్ తగ్గినప్పుడు పాత గ్రామాల ఆనవాళ్లు పోయిన ఇండ్లు, కూలిన గోడలు, ఛిద్రమైన రోడ్లు జీవకళకు ప్రతిరూపాలుగా కనిపిస్తాయి. ముంపు గ్రామాలు భౌగోళికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కరీంనగర్–సిరిసిల్ల రోడ్డులో విశాలమైన మిడ్‌మానేరు జలాశయం, దానిపై నిర్మించిన ఫోర్‌లేన్ బ్రిడ్జి ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
– నాగుల వంశీ, కొదురుపాక
మిడ్‌మానేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తిన అద్భుతమైన క్షణం మొదటిసారిగా 2019, జూలైలో ఆవిష్కృతమైంది. అప్పుడు గేట్ల ద్వారా నీటి విడుదలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. గేట్లు ఎత్తిన అనంతరం నీటి అందాలు చూస్తే తనివి తీరలేదు. – ఐల శివరామ్, మల్లాపూర్
వరదవెల్లి గుట్టపై వెలసిన దత్త ఆలయానికి బోటులో వెళ్లడం ఈ ప్రాంత వాసులకు మంచి అనుభూతి ఇస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోటు ప్రయాణంతో ఆలయం సందర్శించడం ఇక్కడే ఉంది. గుట్టపై నుంచి చూస్తే చుట్టూ నీరు.. పరుచుకున్న పచ్చదనం ఆకట్టుకుంటాయి. – శ్రీపతి కవిత, బోయినపల్లి
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు మిడ్‌మానేరు అందాలు చూడవచ్చు. నాంపల్లిగుట్టపై లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవచ్చు. విలాసాగర్‌లో వెలసిన త్రిలింగసంగమేశ్వరస్వామి మూడు ఆలయాలు.. మూడు గోపురాలు.. మూడు శివలింగాలతో ఆకట్టుకుంటుంది. కోరెం కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.
వేములవాడ రాజన్న ఆలయం, నాంపల్లిగుట్ల, మిడ్‌మానేరు, దత్తాత్రేయ జలాశయాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. ప్రభుత్వం దృష్టి సారిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


