చేతిలో కంకి పట్టినా.. నెత్తిన బతుకమ్మ ఎత్తినా నాగ వ్వ గొంతు విప్పి తే చాలు.. పరిసరాలన్నీ పులకించిపోతాయి. ఎటువంటి సంగీత శిక్షణ లేదు. అక్షరజ్ఞానమూ అంతంతే. అయినా ఆమె గొంతులో తెలంగాణ జానపదపు అమృతం ఉంది. జగిత్యాల జిల్లా మారుమూల పల్లె నుంచి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సినిమా దాకా ఎదిగిన మట్టి గొంతు చుంచు నాగవ్వది.
● నాగవ్వ స్వస్థలం జగిత్యాల జిల్లా అంబారిపేట. తండ్రి యక్షగాన కళాకారుడు. ఊరి పెద్దమనుషి.
● న్యాయం తప్పని ఆయన పంచాయితీ తీర్పులు ఎంత ప్రసిద్ధమో.. ఆయన పాడే యక్షగానం కూడా అంత మధురం.
● బాపు (నాన్న) పాడే పాటలను వింటూ.. ఆ బాణీలను గుండెల్లో నింపుకొని పెరిగింది నాగ వ్వ. పని అలసట తెలియకుండా పొలం గట్ల మీద, ఇంటి అరుగుల మీద ఆమె పాడుకున్న పాటలే ఆమెకు తొలి గురువులు.
● పెళ్లయి గుల్లకోటకు వెళ్లినా భజనలు పాడే భర్త మరింత ప్రోత్సహించాడు.
● ఆమె కొడుకులు నడిపే ‘సీఎంఎస్’ యూట్యూబ్ చానెల్‌తో ఆమె జీవితం మలుపు తిరిగింది.
● ఏటికి ఎండల్లా ఎలబండ్లు కట్టంగా ఎవ్వరనుకుంటినే నా తిరుపతి రెడ్డి పల్లవితో సాగే పాట ను ఒకే ప్రయత్నంలో అద్భుతంగా పాడింది.
● ‘గంటళ్లు మువ్వళ్లు గనగనంగా మోగంగా నా మోహనలాలి’ అనేపాటకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు 20కి పైగా పాటలను తానే స్వయంగా స్వరపరిచి పాడింది.
● వెంకటేశ్, సల్మాన్‌ఖాన్ నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ లోని బతుకమ్మ పాటకు ఆమెతో గొంతు కలిపించారు.
● మంగ్లీతో కలిసి పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట నాగవ్వను సెన్సేషన్‌గా నిలబెట్టాయి.
● పట్టణాల్లోని తళుకుబెళుకులు.. రాత్రికి రాత్రే వచ్చే అవకాశాల కంటే పల్లెటూరి బంధాలకే నాగవ్వ ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామంలోనే ఉంటూ.. మట్టి పరిమళం గల తెలంగాణ జానపదాన్ని వెండితెరపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయమని చెబుతోంది.


