అమ్మమ్మ, తాత, భార్య ప్రోత్సాహంతో..
అమ్మమ్మ, తాతయ్య ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్, సినిమా స్వరాలతో దూసుకుపోతున్న జానపద తేజం మల్లిక్ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకే ప్రాణం పోశాయి. చిన్ననాడు అమ్మమ్మ ఒడిలో, తాతయ్య చెంతన మొదలైన పల్లె బాణీల ప్రస్థానం.. నేడు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో రికార్డులను తిరగరాస్తోంది. పుష్కరాల పాటతో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకుని, జానపద ప్రపంచాన్ని ఏలుతూ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల్లో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఎస్వీ మల్లిక్ తేజ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామానికి చెందిన సింగారపు కొమురయ్య, రాజమ్మ దంపతుల కుమారుడు మల్లిక్ తేజ.
● మల్లిక్ తేజ ఆలపించిన ‘తల్లి గోదావరి’ పాట ఆయన కెరీర్‌కు బలమైన మలుపు తిప్పింది.
● ‘ఉంగూరమే.. అనే పాట ఏకంగా 95 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
● బావామరదళ్లు, సితురాల మనసు, పన్నెండు వందలే రాజిరెడ్డి, లవ్ యు, గున్నగున్న పోయే చిన్నది వంటి పాటలు గాయకుడిగా, గేయ రచయితగా ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి.
తాత వెంకయ్య, అమ్మమ్మ రాజమ్మ, భార్య విజయ అందించిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. పల్లె తల్లి నేర్పిన మట్టి వాసనల పాటలను, గ్రామీణ జీవన విధానం, మన సంస్కతి, మన భాష ప్రపంచానికి వినిపించడమే నా జీవిత లక్ష్యం. నా గళానికి, సంగీతానికి ఇంతటి ఆదరణ అందిస్తున్న శ్రోతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
– ఎస్వీ మల్లిక్ తేజ, జానపద గాయకుడు,
రచయిత, సినీ సంగీత దర్శకుడు.


