● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా చెక్కు అందజేత
హుజూరాబాద్ : విధి నిర్వహణలో మరణించిన 132 కేవీ సబ్ స్టేషన్ ఆర్టిజన్, హుజూరాబాద్‌కు చెందిన బోడ శంకర్ రెడ్డి కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా చెక్కును మంజూరు చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (1535) ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకర్ రెడ్డి భార్య స్వాతికి ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా మంజూరైన చెక్కును ప్రదానం చేశారు. నాయకులు వజీర్, ఉట్ల ప్రభుదాస్, ప్రమోద్ కుమార్, కీర్తి శ్రీనివాస్, పులి కోటి గౌడ్, రాజు లింగం, మేడి రమేశ్, ఆనంద్ పాల్గొన్నారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: రాయికల్‌లోని మార్కండేయకాలనీకి చెందిన కోడాడి శ్రీనివాస్‌రావు (51)జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. శ్రీనివాస్‌రావు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో మానసిక పరిస్థితి సరిగా ఉండడం లేదు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్‌రావుకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫు చేస్తున్నట్లు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న కారు
● ముగ్గురికి గాయాలు
వేములవాడ: వేములవాడ పట్టణంలోని గుడిచెరువు కట్టకింది బస్టాండు ప్రాంతంలో మంగళవారం ఓ కారు అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


