వేములవాడ: వేములవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు వేళ ఊహించని పరిణామం ఎదురైంది. అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని ఈనెల 3న మార్కెట్ యార్డులోని నూతన ప్రాంగణానికి మార్చేందుకు అధికారులు, సిబ్బంది సామగ్రిని సర్దుకునే పనిలో పడ్డారు. విషయం తెలుసుకున్న భవన యజమాని దేవయ్య దంపతులు ఆఫీసుకు చేరుకుని అధికారులకు షాక్ ఇచ్చారు.
బకాయిలు చెల్లిస్తేనే బయటకు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన యజమాని చేతిలో తాళాలు పట్టుకుని సబ్‌రిజిస్ట్రార్ కుర్చీ ఎదుటే బైఠాయించారు. తమకు రావాల్సిన రూ.60 వేల అద్దె, దాదాపు రూ.2 లక్షల కరెంట్ బిల్లు బకాయిలు పేరుకుపోయాయని, వాటిని చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. బాకీలు తీర్చకుండా ఒక్క వస్తువు కూడా బయటకు వెళ్లనిచ్చేది లేదని, అవసరమైతే ఆఫీస్‌కే తాళం వేస్తామని స్పష్టం చేశారు.
నచ్చజెప్పినా వినని యజమానులు
సబ్ రిజిస్ట్రార్ విజయభాస్కర్ కల్పించుకుని, బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్ విడుదలయిందని, త్వరలోనే జమ అవుతాయని యజమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యజమానులు వినలేదు. సాయంత్రం కార్యాలయ పని వేళలు ముగియడంతోనే ఈ హైడ్రామా కొనసాగడంతో కార్యాలయ పనులకు సైతం తీవ్ర విఘాతం కలిగింది. చివరకు ఇల్లు రిపేరింగ్‌కు కొన్ని డబ్బులు సమకూర్చుతామని అధికారి హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగినట్లు సమాచారం.


