వీణవంక: మోసపూరిత హామీలతో నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించి, బాధ్యులైన హైబ్రిడ్ సీడ్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రైతులు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కోరారు. 2024–25 రబీ సీజన్‌లో గుజరాత్‌కు చెందిన ఓ సీడ్స్ కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి ఆడ, మగ వరి (హైబ్రిడ్) సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని హైదరాబాద్‌లోని బూర్గుల రామకష్ణారావు భవన్‌లో కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. పంట దిగుబడి రాకపోతే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారం చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని, పంట నష్టం వాటిల్లడంతో గుజరాత్‌కు పిలిపించుకుని పరిహారం చెల్లిస్తామని హామీఇచ్చినా ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని వాపోయారు. వీణవంక, మానకొండూరు, శంకరపట్నం, మంథని, చిట్యాల తదితర మండలాలకు చెందిన సుమారు 80 మంది రైతులు కోదందరాంను కలిసిన వారిలో ఉన్నారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని, కంపెనీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కోదండరాం వారికి హామీ ఇచ్చారు.


