కొత్తపల్లి(కరీంనగర్): 22ఏ సెక్షన్ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కరించకుంటే చలో సెక్రటేరియట్ చేపడతామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, కొత్తపల్లిలో గల సుమారు 6 వేల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం రేకుర్తి అంబేద్కర్‌చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిజిస్ట్రేషన్ చట్టం 1908లో 115 ఏళ్ల కిందటి శ్రీ22ఏశ్రీను తీసుకొచ్చి పట్టాదారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రేవంత్ సర్కార్ తక్షణమే 22ఏ సెక్షన్‌ను తొలగించని పక్షంలో అసెంబ్లీలో నిలదీస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను అడ్డుకునేందుకు వేయి మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన జరిగే ఆందోళనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్ అధ్యక్షతన జరిగిన రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


