మెట్‌పల్లిరూరల్: వివాహమై రెండేళ్లు గడిచినా సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాకునూరి రోషిత్(28)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన.. సంతానం కలగలేదని కొద్ది రోజులుగా సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ ఆందోళన చెందుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రోషిత్ తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
క్యాన్సర్‌తో ఇంటర్ విద్యార్థిని మృతి
మెట్‌పల్లిరూరల్: క్యాన్సర్‌తో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాద ఘటన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాజవేని కుమార్, స్వప్న దంపతుల కూతురు శ్రీవల్లి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఏడాదిన్నర క్రితం అనారోగ్యానికి గురికాగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించారు. క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం ఇంటి వద్ద తుదిశ్వాస విడిచింది. శ్రీవల్లి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
చొప్పదండి: మండలంలోని రెవెళ్లి గ్రామానికి చెందిన కుంటాల ప్రమోద్ (30) మద్యానికి బానిసై, మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రమోద్‌తో గొడవపడి భార్య కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య దూరమవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రమోద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.


