కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో ఒకరికి డెంగీ పాజిటివ్ నమోదైంది. గ్రామానికి చెందిన యువతి జ్వరంతో బాధపడుతుండగా సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్‌గా గుర్తించారు. బాధితురాలికి జిల్లా వైద్యాధికారులు రెండోసారి నిర్ధారణ పరీక్షలు చేయగా, సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, గ్రామంలో పారిశుధ్య లోపం కనబడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అదృశ్యమైన మహిళ.. వాగులో శవమై
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం చౌలమద్దికి చెందిన ఓ మహిళ అదృశ్యమై.. గ్రామ శివారులోని వాగులో శవమై కనిపించింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి రాజేశ్వరి(50) ఈనెల 20న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం వెదికినా ఆచూకీ దొరకలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తుండగా.. గ్రామ శివారులోని వాగులో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి రాజేశ్వరిగా గుర్తించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, వాగులో పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి కూతురు మాలతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బావిలోపడి మహిళ మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన చక్రం లక్ష్మి(55) మంగళవారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా కంటిచూపు సరిగా లేదని లక్ష్మి మనోవేదనకు గురవుతోందని రూరల్ ఎస్సై మధుకర్ తెలిపారు. ఆ వేదనతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని మృతుడి కుమారుడు చక్రం రాకేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
మోతె చెరువులో మొసలి
జగిత్యాలక్రైం: జగిత్యాల అ ర్బన్ మండలం మోతె చెరువులో మంగళవారం మ ధ్యాహ్నం మొసలి కన్పించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం సమయంలో కొంతమంది నడుచుకుంటూ వెళ్తుండగా వారి వెంట వెళ్తున్న శునకం మొసలిని గుర్తించి అరిచింది. స్థానికులు చెరువులోకి చూసేసరికి మొసలి ఒడ్డుకు వచ్చి కుక్కను లాక్కుపోయేందుకు ప్రయత్నించింది. స్థానికులు కేకలు వేయడంతో మొసలి చెరువులోకి వెళ్లింది.


