గోల్‌మాల్‌ నీడలు! | - | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌ నీడలు!

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

నాసిరకం లైట్లు బిగించారా?

హైమాస్ట్‌ ఎల్‌ఈడీ లైట్ల ప్రొక్యూర్‌మెంట్లపై ఆరోపణలు

ఐదేళ్ల వారంటీ ఉన్న లైట్లకు బదులు నాసిరకం ఎల్‌ఈడీల ఎంపిక

ఇంతవరకూ సదరు లైట్ల వారంటీ సర్టిఫికెట్లు అందజేయని కాంట్రాక్టర్‌

స్మార్ట్‌సిటీలో లైట్లకు వారంటీ సర్టిఫికెట్లు తీసుకున్నారా లేదా అనే అనుమానం?

చర్యలు చేపట్టాలన్న కలెక్టర్‌ కార్యాలయం ఆదేశాలు బేఖాతరు?

సుడా వెలుగుల్లో

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ హైమాస్ట్‌ లైట్లలో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. సుడా పరిధి లోని వివిధ ప్రాంతాల్లో బిగించిన హైమాస్ట్‌ లైట్ల నా ణ్యతలో డొల్లతనంపై ఆరోపణలు పెరిగిపోతున్నా యి. నిబంధనలు పాటించకుండా నాసిరకం లైట్లు ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు కలెక్టర్‌ వద్దకు ఫిర్యాదుల రూపంలో చేరడం వివాద తీవ్రతను చాటిచెబుతోంది.

ఏం జరిగిందంటే..?

కరీంనగర్‌ సుడా పరిధిలోని గ్రామాలు, అర్బన్‌ ప్రాంతాల్లో హైమాస్ట్‌ పోల్‌ ఏర్పాటు చేయడం కోసం టెండర్లు పిలిచారు. ఈ టెండరు నిబంధన ప్రకారం 150 నుంచి 200వాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఎల్‌ఈడీ లైట్లు ఒక హైమాస్ట్‌ పోల్‌కు అమర్చాల్సి ఉంటుంది. 200 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక్క హైమాస్ట్‌ లైటు విలువ రూ.13,554. ఒక్కో పోల్‌కు నాలుగు లైట్ల చొప్పున దాదాపు రూ.54,216. టెండరు నిబంధన ప్రకారంగా.. బీఐఎస్‌ సర్టిఫికేషన్‌, ఐదేళ్ల వారంటీ కలిగిన, ఎల్‌ఎం 79, ఎల్‌ఎం 80 సర్టిఫైడ్‌ ఎల్‌ఈడీ లైట్లు అమర్చాల్సి ఉంటుంది. పని పూర్తయిన తరువాత వారంటీ కార్డులు, సర్టిఫికెట్లు సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. నిర్వహణలో భాగంగా లైటు పనితీరులో సమస్యలు తలెత్తినప్పుడు ఈ వారంటీ సర్టిఫికెట్‌ ద్వారా ఐదేళ్ల పాటు ఉచితంగా మెయింటెనెన్స్‌ పొందే వీలుంటుంది. ఒకవేళ వారంటీ సర్టిఫికెట్లు తీసుకోకపోతే.. ఈ హైమాస్ట్‌ ఎల్‌ఈడీ లైట్లలో మరమ్మతులు తలెత్తితే సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్‌ సిటీలోనూ అంతే..

గతంలో అంబేద్కర్‌ స్టేడియం వాకింగ్‌ ట్రాక్‌లో స్మార్ట్‌సిటీ నిధులతో ఏర్పాటు చేసిన లైట్లు తక్కువ కాలంలోనే పనిచేయకపోవడం, అప్పటికే సదరు లైట్ల వారంటీ ముగిసిందని మున్సిపల్‌ అధికారులు చెప్పడంతో స్థానికులు విస్తుపోయారు. ఈ లైట్లు 2023 ఆగస్టులో ఏర్పాటు చేయగా.. 2025 ఆగస్టు నాటికి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ముగిసిందని అధికారులు తెలపడం వెనక వారంటీ సర్టిఫికెట్లు కలెక్ట్‌ చేయడం లేదన్న ఆరోపణలకు బలం చేకూరింది. దీని వల్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ సొంత నిధులతో రెండేళ్లకే లైట్లను రిపేర్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో రిజిష్టరైంది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎన్ని లైట్లకు కార్పొరేషన్‌ వద్ద వారంటీ సర్టిఫికెట్లు తీసుకున్నారన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతుండటం కొసమెరుపు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. టెండరు గెలుచుకున్న గుత్తేదారు అతి తక్కువగా కోట్‌ చేయడం ద్వారా నాణ్యత విషయంలో రాజీపడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. స్టాండర్డ్‌ ఆఫ్‌ షెడ్యూల్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)లో సూచించిన కంపెనీల ఎల్‌ఈడీ లైట్లకు బదులుగా నాసిరకపు లైట్లు బిగించాన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కలెక్టర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు వెళ్లింది. స్పందించిన కలెక్టర్‌ కార్యాలయం వెంటనే సుడా పరిధిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ ఎల్‌ఈడీ లైట్ల వారంటీ సర్టిఫికెట్లు కలెక్ట్‌ చేసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్లకు, జిల్లా పంచాయతీ అధికారికి సూచించింది. అదే సమయంలో టెండరు నిబంధనల్లో పేర్కొన్న విధంగా లైట్లు ఏర్పాటు చేశారా లేదా అన్న విషయాన్ని పరిశీలించి కాంట్రాక్టర్లు వారంటీ కార్డులు జమచేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ సూచనలు వెలువడి ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement