కరీంనగర్ కార్పొరేషన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతుందో ఆ పార్టీ నేతలు చెప్పాలని మున్నూరుకాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదని విమర్శించారు. శుక్రవారం నగరంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కారాదనే లక్ష్యంతో దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం తెచ్చారన్నారు. ప్రస్తుతం ఎక్కడా అక్రమాలకు తావివ్వరాదనే నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయించి, రూ.2,050 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపరాదని కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ నిధులపై కేంద్ర మంత్రి బండి స ంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు ఎండీ.తాజ్, వెన్నం రజితారెడ్డి, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, కూడలి శ్రీధర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అమీర్, కుంబాల రాజు కుమార్, సామ్రాట్, బొమ్మరాతి సాయి పాల్గొన్నారు.


