జ్యోతినగర్: కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేసేందుకు ఫ్యామిలీ రిజిష్టర్ (కుటుంబ రిజిష్టర్) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమపథకాలు, ఇతర అధికారిక అవసరాల కోసం కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించేందుకు సమగ్ర అధికారిక రికార్డు లేదు. పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో కుటుంబాల వివరాలను ఒకేచోట నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
రేషన్‌కార్డు డేటా ఆధారంగా..
ప్రస్తుతం అందుబాటులో ఉన్నరేషన్ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాల ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించింది. దీంతో కుటుంబంలో ఎవరు సభ్యులు, వారిప్రాథమిక వివరాలు ఏమిటనే అంశాల అధికారిక ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంటుంది.
సంక్షేమ పథకాలకు కీలకంగా మారే అవకాశం
సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులను గుర్తించడం , కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించడం, ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడం వంటి అంశాల్లో ఫ్యామిలీ రిజిష్టర్ కీలకంగా మారే అవకాశం ఉంది. కుటుంబ వివరాల ఆధారంగా పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
రేషన్ కార్డు డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్
మీ సేవ ద్వారా వివరాల సర్టిఫికెట్ జారీకి ఏర్పాట్లు


