విజిలెన్స్‌.. ఇంటెలిజెన్స్‌.. ఎంటీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌.. ఇంటెలిజెన్స్‌.. ఎంటీఎఫ్‌

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

ఆస్తుల పరిరక్షక్షణకు మూడంచెల భద్రత అయినా సింగరేణి సంస్థలో ఆగని చోరీలు స్క్రాప్‌ వదిలేసి కాపర్‌ కేబుళ్లపై చోరుల దృష్టి దొంగలు దొరికినా నమోదు కాని పోలీస్‌ కేసులు

గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణకు విజిలె న్స్‌, ఇంటెలిజెన్స్‌, మొబైల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎంటీఎఫ్‌) ఏర్పాటు చేసింది. అక్రమాలు, ఆస్తులపై ఇవి డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. మూడంచెల భద్రతను దాటి దొంగల ముఠాలు విలువైన ఆస్తులు చోరీచేస్తున్నాయి. పర్మినెంట్‌ సెక్యూరిటీ సిబ్బందితోపాటు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు అన్ని ఏరియాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నా చోరీలు ఆగడంలేదు.

పర్మినెంట్‌ తగ్గి.. ప్రైవేట్‌ పెరిగి..

సింగరేణిలో పర్మినెంట్‌, ప్రైవేట్‌ భద్రతా సిబ్బంది 60:40 నిశ్పత్తిలో ఉండాలి. ఈ నిబంధనలు కాదని పర్మినెంట్‌ కన్నా ప్రైవేట్‌సెక్యూరిటీ గార్డులనే అత్యధిక సంఖ్యలో నియమిస్తోందని యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. తద్వారా పర్మినెంట్‌ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇది సంస్థ ఆస్తుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకూ అనేక ఫిర్యాదులు వెళ్తున్నాయి.

కాపర్‌పైనే దొంగల కన్ను

దొంగల ముఠాలు కాపర్‌పైనే దృష్టి సారించాయి. ప్రధానంగా ఓసీపీలు, స్క్రాప్‌యార్డులు, కేబుల్‌ యార్డుల్లో పడిఉన్న కాపర్‌ను ఎత్తుకెళ్తున్నాయి. త్రీ కోర్‌ ఆర్మ్‌డ్‌, ఫోర్‌కోర్‌ ఆర్మ్‌డ్‌, ఫ్లెక్సిబుల్‌ తదితర విలువైన కాపర్‌ కేబుళ్లను కట్‌చేస్తూ చోరీచేస్తున్నా యి. ఎత్తుకెళ్లిన కేబుళ్లను మంటల్లో కాల్చగా వచ్చిన కాపర్‌ను కిలో సుమారు రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్న దొంగలు సొమ్ముచేసుకుంటున్నారు.

రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు..

ఓసీపీల్లో విద్యుత్‌తో నడిచే భారీయంత్రాల కోసం సింగరేణి రూ.కోట్లు వెచ్చించి కేబుళ్లు కొనుగోలు చేస్తోంది. భూగర్భ గనుల్లోనూ భారీకాపర్‌ కేబుళ్లను వినియోగిస్తోంది. కేబుళ్ల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్న యాజమాన్యం.. ఇదే కేబుల్‌ చోరీకి గురైతే స్క్రాప్‌ కింద లెక్కిస్తూ తక్కువ ధర చూపిస్తోందని విమర్శలు ఉన్నాయి.

ఓసీపీ–2లో మరో కేబుల్‌చోరీ

సింగరేణి రామగుండం డివిజన్‌–3 పరిధిలోని ఓసీపీ–2లో మరో కేబుల్‌చోరీ జరిగినట్లు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున సిగ్నల్‌ పాయింట్‌ వద్ద 120ఎంఎం ఫ్లెక్సిబుల్‌ పవర్‌కేబుల్‌ 60 మీటర్ల మేర దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈవిషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

ముఠాల ‘మేనేజ్‌ పాలసీ’

కాపర్‌ కేబుల్‌ ముఠాలు దొంగతనం చేసి ఘటనా స్థలాల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నాయి. ఒకవేళ సెక్యూరిటీ, భద్రతా సిబ్బందికి దొరికితే ‘మేనేజ్‌ పాలసీ’ అమలు చేస్తున్నాయి. తమకు అండగా నిలుస్తున్న రాజకీయనాయకుల పలుకుబడి ఉపయోగించి కేసులు లేకుండా బయట పడుతున్నాయి. సెక్యూరిటీ అధికారులు నామమాత్రపు ఫిర్యాదులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోనే కేబల్‌ చోరీ ముఠాలకు హద్దూఅదుపు లేకుండా పోతోందని కార్మిక సంఘాలు, కార్మికులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనమే.. గత జూలైలో ఓసీపీ–2లో దొంగలు ఏకంగా యంత్రంలోకి చొరపడ్డారు. కాపర్‌ కేబుల్‌ చోరీచేస్తూ భద్రతా సిబ్బంది చేతికి చిక్కారు. వారిపై ఇప్పటివరకూ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కాకపోవడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.

భారీ యంత్రాలే లక్ష్యం

ఓసీపీల్లో మూలనపడేసిన యంత్రాలకు కేబుళ్లను అలాగే ఉంచారు. దొంగలు రాత్రిపూట వీటిని కట్‌చేసి ఎత్తుకెళ్తున్నారు. ఓసీపీ–1లోని పృథ్వీభంజన్‌ డ్రాగ్‌లైన్‌ యంత్రానికి చెందిన కాపర్‌వైర్‌ను గత మేలో దొంగలు చోరీచేయడం కలకలం రేపింది. సుమారు మీటర్‌ పొడవున కేబుల్‌లో సుమారు 10 కేజీల వరకు కాపర్‌ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement