సహకార పీఠం.. విధేయులకే పట్టం గొల్లపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నామినేటెడ్ ప్రాతిపదికన నూతన పాలకవర్గాలు త్వరలోనే కొలువుదీరబోతున్నాయి. పీఏ సీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నింటినీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అ ర్హులైన ఆశావాహుల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని అధిష్టానం ఎమ్మెల్యేలకు సూచించింది. ఆ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ పరిధి లో ని పీఏసీఎస్‌లలో పదవులు ఆశిస్తున్న నేతల వివరా లు సేకరిస్తున్నారు. మరోవైపు నాయకులు కూడా జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. తొలిసారి పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తుండటంతో అధికార పార్టీలో తీవ్ర హడావుడి నెలకొంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు పీఏసీఎస్‌లలో సభ్యులుగా ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న అన్నదాతలతో ముడిపడి ఉన్న పదవులు కావడంతో ఈ భర్తీ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత కీలకంగా పరిగణిస్తోంది. పదవుల కోసం ఆశావాహుల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండటంతో సరైన నేతలను ఎంపిక చేయడం మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. 2023 ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి కాకుండా.. ఏళ్ల తరబడి పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చిన సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని పీఏసీఎస్‌లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు. 2020లో డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్‌రావును అప్పటి ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా పింగిలి రమేశ్ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి కొనసాగారు. ఆయన పదవీకాలం ముగిసేవరకు ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది. 2025 డిసెంబర్ 19తో డీసీసీబీల పదవీకాలం ముగియగా.. ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు పొడిగించింది. చివరకు పాలకవర్గాన్ని రద్దు చేసింది. ఇక పీఏసీఎస్ పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పుతో వారు కొనసాగుతున్నప్పటికీ, వారి గడువు కూడా త్వరలోనే ముగియనుంది.
గతంలో పీఏసీఎస్‌లలో సభ్యులైన రైతులు నేరుగా డైరెక్టర్లను ఎన్నుకునేవారు. వారిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికయ్యేవారు. ఆ తర్వాత పీఏసీఎస్ చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను ఎన్నుకుంటే.. డైరెక్టర్ల నుంచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునే విధానం ఉండేది. ఈ పాత ఎన్నికల విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. పీఏసీఎస్‌ల నుంచి డీసీసీబీ వరకు అన్ని పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలోనే నియమించనుంది. చైర్మన్, వైస్ చైర్మన్‌తో కలిపి డీసీసీబీకి మొత్తం 22 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరి ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి రానుంది.
రైతు సంఘాలపై ‘అధికార’ మార్క్
తొలిసారిగా నామినేటెడ్ పద్ధతిలో భర్తీ
పార్టీ విధేయుల జాబితాపై ఎమ్మెల్యేల కసరత్తు
పదవిని దక్కించుకునే ప్రయత్నాల్లో ఆశావహులు
ఉమ్మడి జిల్లా సహకార సంఘాలు
సీనియర్లకే ప్రాధాన్యం..?
పీఏసీఎస్ నుంచి డీసీసీబీ దాకా..
పాత పద్ధతికి స్వస్తి
కరీంనగర్
సంఘాలు 30
సభ్యులు 1.30లక్షలు
జగిత్యాల
సంఘాలు 51
సభ్యులు 1.50లక్షలు
పెద్దపల్లి
సంఘాలు 20
సభ్యులు 41,639
రాజన్న సిరిసిల్ల జిల్లా
సంఘాలు 24
సభ్యులు 65,000