● సుడా మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: భూకబ్జాలతో అప్పటి బీఆర్‌ఎస్, కర్రలు, కత్తులతో దాడులు చేస్తూ ఇప్పటి బీజేపీ నగర ప్రశాంతతను చెదరగొడుతున్నాయని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ నగరపాలకసంస్థను అప్పుడు బీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే కార్పొరేటర్లు భూకబ్జాలకు పాల్పడి జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. దేశం, ధర్మం అంటూ మాయమాటలతో నగరపాలక సంస్థను కై వసం చేసుకొన్న బీజేపీ కార్పొరేటర్లు కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బలంతోనే బీజేపీ కార్పొరేటర్లు ఈ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దాడులు చేశారని, ఎంపీ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై కర్రలతో దాడులకు దిగారన్నారు. తాజాగా కిసాన్‌నగర్‌లో కత్తులు, బీరుసీసాలతో దాడి చేసి ఓ బీజేపీ కార్పొరేటర్ జైలుకు వెళ్లాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, కాంతాల జగన్‌రెడ్డి, పర్వతం మల్లేశం, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.తాజ్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


