కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా జిల్లాలో ఒక్క విద్యార్థికి కూడా కొత్త యూనిఫాం అందలేదు. పంద్రాగస్టు వేడుకలకు పాత దుస్తులతోనే హాజరు కావాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల ప్రణాళిక లోపం, వస్త్రం సరఫరాలో జాప్యం, కుట్టించే ప్రక్రియలో నిర్లక్ష్యంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది.
కలెక్టర్ ఆదేశించినా
పంద్రాగస్టు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెండా పండుగలోపు విద్యార్థులకు యూని ఫాం అందించాలని ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం పుంజుకోలేదు. మరో నాలుగు రోజుల్లో పంద్రాగస్టు వేడుకలు ఉండగా.. యూని ఫాం ఎప్పుడు కుడతారు..? ఎప్పుడు విద్యార్థులకు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒక్కొక్కరికి రెండు జతలు
ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు, 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, బాలికలకు రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాల్సిన దుస్తులు రెండు నెలలు గడిచినా అందకపోవడంతో విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు.
74 వేలకుపైగా దుస్తులు
జిల్లాలో 616 ప్రభుత్వ పాఠశాలల్లో 37,227 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 74,446 దుస్తులు అవసరం. ప్రభుత్వం వస్త్రాన్ని సరఫరా చేసి, మహిళా సంఘాలు, ఐకేపీ, ఎన్‌జీవోల ద్వారా కుట్టించే బాధ్యతను అప్పగించింది. పంద్రాగస్టు నాటికై నా కొత్త దుస్తులు అందుతాయా? లేక గతేడాది దుస్తులతోనే జెండా పండుగకు హాజరు కావాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


