చీకటి వెలుగులు.. | - | Sakshi
Sakshi News home page

చీకటి వెలుగులు..

Jul 26 2026 2:44 AM | Updated on Jul 26 2026 2:44 AM

జైల్లో అక్షరాస్యతతో చదువురాని ఖైదీల జీవితాల్లో వెలుగు

నిరక్షరాస్యులకు చదువు నేర్పిస్తున్న కరీంనగర్‌ జైలు అధికారులు

వేలిముద్రతో వచ్చి.. విడుదల సమయంలో సంతకం చేసి

ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచంలోకి..

పునరావాస కేంద్రాలుగా కారాగారాలు

కరీంనగర్‌క్రైం:

తెలిసో.. తెలియకో నేరం చేశారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న జీవితాన్ని నాలుగు గోడలకు పరిమితం చేసుకున్నారు. కారాగారం అనే చీకటి ప్రపంచంలో మగ్గుతున్నారు. శిక్ష అనుభవించి, బయటకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వారిలో అక్షరాస్యులతో పాటు ఎంతోమంది నిరక్షరాస్యులుంటారు. ప్రస్తుతకాలంలో అక్షరం రాకుంటే బతకడమే కష్టం అని గ్రహిస్తున్న జైలు అధికారులు చదువురాని ఖైదీలకు ఓనమాలు నేర్పుతున్నా రు. కనీసం సంతకం అయినా చేయరావాలని సూచిస్తున్నారు. జైలుకు వచ్చే సమయంలో పేరు రాయరాక అధికారిక పత్రాలపై వేలిముద్ర వేసిన పలువురు ఖైదీలు, విడుదలయ్యే సమయానికి సంతకం చేసి జైలు గుమ్మం దాటుతున్నారు. ఈ మా ర్పు వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.

చదువురాని వారికి ప్రత్యేక శిక్షణ

కరీంనగర్‌ జైలులో నిరక్షరాస్యులను గుర్తించి చదువు నేర్పిస్తున్నారు. జైలులోని చదువు వచ్చిన ఖైదీలతో శిక్షణ అందిస్తున్నారు. సంతకం నేర్పడంతో పాటు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. తెలుగు అక్షరాల నుంచి ప్రారంభించి, పేరు రాయడం, చదవడం, సంతకం చేయడం వరకు నేర్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి పుస్తకాలు, నోటుబుక్స్‌, అవసరమైన సామగ్రి అందిస్తున్నారు. కరీంనగర్‌ జైలులో 349 మంది ఖైదీలకు 29 మంది మహిళలు, 320మంది పురుషులు ఉన్నారు. 34 మంది శిక్షపడిన ఖైదీలుండగా మిగితా వారు రిమాండ్‌గా ఉన్నారు. చదువురాని వారిలో 15మంది మహిళలు, 31మంది పురుషులున్నారు.

సంతకం.. సంతోషం

జైలుకు వచ్చినప్పుడు అధికారిక రికార్డుల్లో వేలిముద్రతో నమోదు అయిన ఖైదీలు, విడుదల సమయంలో సంతకం చేయడం చూసి అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇకపై నిజాయితీగా జీవించాలని నిర్ణయించుకున్నామని పలువురు ఖైదీలు చెబుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జైలు అనేది కేవలం శిక్ష అనుభవించే స్థలం మాత్రమే కాదని, వ్యక్తిత్వాన్ని మార్చే పునరావాస కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement