బోర్లు, బావుల్లో అడుగంటిన నీరు
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలో సాగు నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఏటా బోర్లు, బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం సాగు చేస్తుంటారు. వర్షకాలం ఆరంభమై 40 రోజులు దాటినా వానలు కురవకపోవడంతో బోర్లు అడుగంటి పంటల సాగుపై రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.
రెండెకరాల్లో వరి సాగు చేసేందుకు 40 రోజుల క్రితం నారు పోసిన. వర్షాలు లేక బావిలో నీళ్లు అడుగంటిపోయాయి. వరి నారు ముదిరింది. నీళ్లు లేకపోవడంతో నాట్లు వేద్దామంటే భయమేస్తుంది. అప్పు చేసి అష్టకష్టాలు పడి నారు పోసి భూమిని చదును చేయించా. వర్షాలు లేక వరి సాగు కష్టమే అనిపిస్తుంది.
– దేశవేని గంగరాజం,
రైతు, సిరికొండ, కథలాపూర్
తాండ్య్రాల శివారులో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్న. వరి సాగు చేద్దామని నారు పోసిన. 5 ఎకరాలకు ఒక్కటే బోరుబావి ఉంది. సూరమ్మ ప్రాజెక్టు, తాండ్య్రాల ఊర చెరువులో నీళ్లుంటే బోరుబావిలో పుష్కలంగా నీళ్లుంటాయి. వర్షాలు లేక బోరు నుంచి కొన్ని నీళ్లు వస్తున్నాయి. త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. వరి నారు ఎదిగింది. నాట్లు వేద్దామంటే నీళ్లు లేవు. త్రీఫేజ్ కరెంట్ సరిగా ఉంటుందో ఉండదోనని అట్లాగే వదిలేసిన. – బాల్క సంజీవ్,
రైతు, తాండ్య్రాల, కథలాపూర్


