చికిత్స పొందుతూ యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడు మృతి

Jul 19 2026 11:33 PM | Updated on Jul 19 2026 11:33 PM

రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన మాజీ ఉప సర్పంచ్‌ కోడిపుంజుల భూమేశ్‌ చిన్న కుమారుడు సాయిప్రసన్న(25) గత ఆదివారం బసంత్‌నగర్‌ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బుగ్గ ఎక్స్‌ రోడ్డు వద్ద అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. సాయిప్రసన్న బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడని, ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లాడంటూ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరు..

● కాలిపోయిన స్థితిలో మృతదేహం

సిరిసిల్లఅర్బన్‌: సిరిసిల్ల పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌కు చెందిన గుండ్ల రాజు (58), కౌసల్య దంపతులు. ఏడాది క్రితం పట్టణ శివారులోని మొదటి బైపాస్‌ రోడ్డులో భార్యాభర్తలు సైకిల్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో కౌసల్యకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పటి నుంచి రాజు తంగళ్లపల్లి మండలంలోని ఓ వృద్ధాశ్రమంలో జీవించేవాడు. ఒంటరితనంతో అతడి మానసిక స్థితి సరిగా లేక సిరిసిల్లలోని తన అక్క సుజాతకు వృద్ధాశ్రమ నిర్వాహకులు ఈ నెల 15న అప్పజెప్పారు. కాగా 16న రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రాజు తిరిగి రాకపోవడంతో అతడి అక్క బంధువులు, తెలిసిన వారిని వాకబు చేసింది. ఈ క్రమంలో ఇందిరానగర్‌, గణేశ్‌నగర్‌ మధ్య గల పొలాల వద్ద కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement