ప్రతిభకు కొలమానం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు కొలమానం

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

కరీంనగర్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే తొలిమెట్టు కార్యక్రమ షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. గతంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఆప్‌లైన్‌లో బేస్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించే వారు. మూడేళ్లుగా రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో అన్ని జిల్లాలకు ఒక్కేసారి నిర్వహించగా, ఈసారి జిల్లావారీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల 23 నుంచి షెడ్యూల్‌ ఖారారు చేసింది.

అభ్యాస సామర్థ్యం గుర్తించేలా

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేసి, వారి బలాలు, బలహీనతలను గుర్తించేందుకు విద్యాశాఖ బేస్‌లైన్‌ పరీక్షకు శ్రీకారం చుట్టింది. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలో ఈనెల 23 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల ఫలితాలను విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధన అందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే కార్యాచరణను అమలు చేయనున్నారు.

చదవడం నుంచి గణితం వరకు

ప్రాథమిక తరగతుల విద్యార్థులకు చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం వంటి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను నిర్దిష్ట వేగంతో, తప్పులు లేకుండా చదివే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థులకు సంఖ్యల గుర్తింపు, కూడికలు, తీసివేతలు, 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, గుణకం, భాగహారం అంశాలపై పరీక్ష ఉంటుంది. పాఠ్యాంశాల ఆధారంగా కనీస అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఇస్తారు.

ఉమ్మడి జిల్లాలో బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించే తేదీలు

జూలై జిల్లా 2–5 తరగతుల

విద్యార్థులు

23, 24 కరీంనగర్‌ 22,308

23, 24 జగిత్యాల 31,445

25, 27 పెద్దపల్లి 15,411

28, 29 రాజన్న సిరిసిల్ల 17,202

2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు

ఆన్‌లైన్‌లో మూడు విడతల్లో పరీక్ష

ఉమ్మడి జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభం

ఫలితాల ఆధారంగా ప్రత్యేక బోధన

యాప్‌లో నమోదు.. ప్రత్యేక కార్యాచరణ

పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా జిల్లాలు, మండలాలకు పంపించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఫలితాలను తెలంగాణ ఎడ్యుకేషన్‌ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ వివరాలను ఎస్‌సీఈఆర్‌టీఈ విశ్లేషించి విద్యార్థుల అభ్యాస లోపాలను గుర్తిస్తుంది. అనంతరం ఆయా లోపాల నివారణకు ప్రత్యేక బోధన, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించనుంది. దీంతో ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయి స్పష్టంగా తెలిసి, విద్యా ప్రమాణాల పెంపునకు మార్గం సుగమం కానుంది. పరీక్ష నిర్వహణపై ఇప్పుటికే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి క్షేత్ర స్థాయికి తగు ఆదేశాలు అందాయి. బేస్‌లైన్‌ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement