281 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
కరీంనగర్‌క్రైం: నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 281 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా సరైన ధ్రువపత్రాలు లేని 224 వాహనాలను సీజ్ చేశారు. ఈ చలాన్‌ల రూపంలో 1,267 వాహనాలకు రూ.6.24 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల భద్రత కోసం వేకువజాము వరకు పనిచేసిన పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు.
కేక్‌కట్ చేసిన సీపీ
నూతన సంవత్సరం సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ ఆలం కేక్ కట్ చేసి అందిరికీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రమాద రహితమే లక్ష్యం కావాలి
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే డ్రైవర్ల లక్ష్యం కావాలని కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ) పురుషోత్తం అన్నారు. ఈనెల 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, దరఖాస్తుదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటిని నియంత్రించేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరిమితికి మించి వ్యక్తులను రవాణా చేయొద్దని, హెల్మెట్, లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపవద్దని సూచించారు. జిల్లాలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత, ఏవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం విద్యుత్ ఉద్యోగులు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, వివిధ యూనియన్ల ప్రతినిధులు ఎస్‌ఈకి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
కరీంనగర్‌కల్చరల్: విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, వాటని ప్రతిఒక్కరూ వినియోగించుకుని మేధావులుగా ఎదగాలని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ రెవెన్యూక్లబ్‌ను సందర్శించి మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు అవసరమైన పుస్తకాలు, దినపత్రికలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మొసం అంజయ్య, క్లబ్ అధ్యక్షుడు విజయ్, ఏవో సుధాకర్ తదితరులున్నారు.
281 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
281 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
281 డ్రంకెన్ డ్రైవ్ కేసులు


