శరవేగంగా సమీకృత కలెక్టరేట్
కరీంనగర్‌అర్బన్: నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప లుమార్లు గడువు మీద గడువు పొడిగించిన కలెక్టర్ తాజాగా సంక్రాంతికి ప్రారంభించేందుకు సన్నాహా లు చేస్తున్నారు. యుద్ధప్రతిపాదికన కారిడార్, కార్యాలయాల్లో ఫర్నీచర్, తదితర పనులు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం. ఈ క్రమంలో దాదాపు 80శాతం పనులు పూర్తవగా మరో 12 రోజుల్లో కార్యాలయ సముదాయం అందుబాటులోకి రానుంది.
ఆగుతూ.. సాగిన పనులు
వాస్తవానికి నూతన కలెక్టరేట్ 2022 డిసెంబర్‌లోగా అందుబాటులోకి రావాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనులు మందగించి బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. రాష్ట్రమంతటా దాదాపు అన్ని కలెక్టరేట్లు కొత్త కార్యాలయాల సముదాయాల్లో సేవలందిస్తుండగా కరీంనగర్ కలెక్టరేట్ మాత్రమే పాత భవనంలో సేవలందిస్తోంది. క్యాంపు కార్యాలయాలు పాతవాటినే వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2021లో అప్పటి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రూ.51కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2022 డిసెంబర్‌లోగా పనులు పూర్తవ్వాల్సి ఉండగా గుత్తేదారు నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నూతన భవనం అందని ద్రాక్షగా మారింది.
తప్పనున్న అద్దెల భారం
ఏడాదిలోగా నిర్మాణ పనులు పూర్తవుతాయని భావించగా ఏళ్ల తరబడి జాప్యం జరగడం అద్దెల భారం తప్పడం లేదు. మొత్తం 43 శాఖలు కలెక్టరేట్‌లోనే విధులు నిర్వహించగా నాలుగైదు శాఖలు అద్దె భవనాల్లో ఉండేవి. కాగా కలెక్టరేట్ సగ భాగం కూల్చివేతతో 15 విభాగాల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో సేవలందిస్తున్నాయి. సదరు విభాగాలకు ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దె భారం పడుతుండగా నిర్మాణం సాగదీస్తుండటంతో అదనపు భారం తప్పడం లేదు. నూతన కార్యాలయాలు అందుబాటులోకి వస్తుండగా రూ.లక్షల అద్దెల భారం తప్పనుంది.
కూల్చివేత లేనట్టే
2016 అక్టోబర్‌కు ముందు ఉమ్మడి జిల్లాకేంద్రంగా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాలకు ఇక్కడి నుంచే పరిపాలన సాగేది. జిల్లాల విభజనతో నూతన జిల్లాల్లో కలెక్టర్ల నిర్మాణాలు పూర్తవగా కరీంనగర్‌లో మాత్రం ఇంకా అసంపూర్తే. అయితే లక్షన్నర చదరపు అడుగులు ఉండాలన్న ఆదేశాల క్రమంలో హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టరేట్ కోసమే సేకరించారు. హెలిప్యాడ్ స్థలం 8ఎకరాల వరకు ఉండడం 18 ఎకరాలకు పైగా ప్రస్తుత కలెక్టరేట్ ఉందని అధికారుల అంచనా. కాగా కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి 2018 మే లో రూ.51కోట్లు మంజూరు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నిపుణులు మరికొంతకాలం భవన నాణ్యతకు ఢోకా లేదని నివేదించడంతో అప్పుడు బ్రేక్ పడింది. క్రమేణా ప్రభుత్వం, యంత్రాంగం సమాలోచనల క్రమంలో 2021లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే 1981లో అప్పటి కలెక్టర్ శర్మ హయాంలో ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణం జరగగా 12ఏళ్ల క్రితం కెమికల్ కోటింగ్‌తో మరమ్మతులు చేశారు. అయినా ఊరుపులు, పెచ్చులూడటం జరుగుతూనే ఉంది. పాత కలెక్టరేట్‌ను సగభాగమే కూల్చివేసి నిర్మాణ పనులు తుది దశకు చేరగా మిగతా సగ భాగం కలెక్టరేట్‌ను అలాగే కొనసాగించనున్నట్లు సమాచారం.


