నగర ఓట్లు 3,40,775
ఓటర్ల వివరాలు..
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఓటర్ల లెక్కతేలింది. నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరంలోని 66 డివిజన్‌లకు సంబంధించి ముసాయిదా జాబితాను గురువారం రాత్రి నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ విడుదల చేసి, కార్యాలయంలోని నోటీసు బోర్డుపై స్వయంగా అంటించారు.
పునర్విభజన ఆధారంగా..
నగరంలోని డివిజన్‌ల పునర్విభజన ఆధారంగా పోలింగ్ బూత్‌ల ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించారు. గతంలో 60 డివిజన్‌లతో ఉన్న నగరపాలకసంస్థలో బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు, కొత్తపల్లి మున్సిపాల్టీని విలీనం చేయడం తెలిసిందే. గ్రామాలు, మున్సిపాల్టీ విలీనంతో 66 డివిజన్‌లుగా పునర్విభజించారు. మున్సిపల్‌ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలో గత డిసెంబర్ 30 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించారు. మూడురోజుల కసరత్తు అనంతరం 66 డివిజన్‌ల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ జాబితాపై అభ్యంతరాలను కూడా స్వీకరించనున్నారు. జాబితాలపై ఈ నెల 5న నగరపాలకసంస్థ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, 10న తుది జాబితా ప్రకటించనున్నారు.
మహిళలే కాస్త ఎక్కువ
నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,69,763 కాగా, మహిళలు 1,70,969 మంది ఉన్నారు. పురుషుల కన్నా 1,206 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. డివిజన్ల వారీగా చూస్తే అత్యధికంగా 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్డు కాలనీ, సదాశివపల్లిలో 6,486 ఓట్లు ఉండగా, తక్కువగా 14వ డివిజన్‌లో 4,210 ఓట్లు ఉన్నాయి.
రాత్రి వరకు కుస్తీ
ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణలో పట్టణ ప్రణాళిక అధికారులు రాత్రి వరకు కుస్తీ పట్టారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. సాయంత్రానికి జాబితాను నోటీసు బోర్డుపై అంటిస్తారనే సమాచారంతో మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు పెద్ద సంఖ్యలో బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, గంటల కొద్ది వేచి చూసినా జాబితా విడుదల కాలేదు. రాత్రి 7 గంటలకు కమిషనర్ నోటీసు బోర్డుపై జాబితాను అంటించగా, రాత్రి 9 గంటలకు వరకు నోటీసుబోర్డు నుంచి ఆ కాగితం కూడా మాయమైంది. చివరకు రాత్రి 11 గంటలకు డివిజన్‌ల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
పురుషులు 1,69,763, సీ్త్రలు 1,70,969
ఇతరులు 43, మొత్తం 3,40,775
బల్దియాలో న్యూ ఇయర్ వేడుకలు
నగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించారు. కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణుమాధవ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, డీఈలు వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్, లచ్చిరెడ్డి, ఆర్‌వోలు భూమానందం తదితరులు పాల్గొన్నారు. కాగా కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం నాయకులు కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


