మత్స్యసాగు వైపు దృష్టి సారించాలి
కరీంనగర్: గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధితోనే దేశ ఆర్థికవృద్ధి సాధ్యపడుతుందని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్‌రావు అన్నారు. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ‘కిసాన్ గ్రామీణ మేళా’ గురువారం రెండోరోజు కొనసాగింది. కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు, మేళా నిర్వాహకుడు సుగుణాకర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ, మిడ్ మానేరు, ఎగువ మానేరు, కాళేశ్వరంతో వాటర్‌జంక్షన్‌గా మారిందన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు వరిసాగుకే పరిమితం కాకుండా, చేపలు, రొయ్యల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఎల్.జలపతిరావు మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పంట మార్పిడి విధానాలు అనుసరించాలన్నారు. ప్రముఖ వ్యవసాయ నిపుణుడు వెంకటేశ్వర్లు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై వివరించారు. ఆయన రచించిన పుస్తకాన్ని ఆవి ష్కరించి రైతులకు అంకితమిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. గొర్రెల పెంపకందారుల రాష్ట్ర ఫెడరేషన్ మాజీ చైర్మన్ రాజయ్యయాదవ్, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రభాకర్‌రావు, కరీంనగర్ డైరీ జనరల్ మేనేజర్ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


