కేన్సర్‌పై టీకాస్త్రం
‘ఆరోగ్య మహిళ’కు పెరుగుతున్న ఆదరణ
● యుక్త వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ● ఏర్పాట్లలో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ
● జిల్లాలో 11వేల మంది అర్హులుగా గుర్తింపు ● ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తి
● ఆరోగ్య మహిళ ద్వారా జిల్లాలో మూడేళ్లలో 2.81 లక్షల మందికి స్క్రీనింగ్
కరీంనగర్: మహిళలు ఇటీవల ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా గుర్తించిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అవసరం అయినవారికి చికిత్స అందిస్తోంది. రొమ్ము, సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) కేన్సర్ ఎక్కువగా వస్తోందని గుర్తించింది. యుక్త వయసులోని వారూ దీని బారిన పడుతున్నారు. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుక్త వయస్సు (14–15 సంవత్సరాలు మధ్య) గల బాలికలకు టీకాలు ఉచితంగా వేయాలని సంకల్పించాయి. ఈ వయసు బాలికలకు హర్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్‌ఫెక్షన్లు సోకి కేన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నిలువరించేందుకు హ్యూమన్ పాపిల్లో మా వైరస్ (హెచ్‌పీవీ) టీకాలు వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. జనవరిలో టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.
బాలికల గుర్తింపు ప్రక్రియ
జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాల్లో నమోదై ఉన్న 14–15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలను గుర్తించడంతో పాటు ఇంటింటి సర్వే చేపట్టి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బాలికల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 11 వేల మంది వరకు 14నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీరికి హెచ్‌పీవీ టీకాలు వేయడం ద్వారా కేన్సర్ మహమ్మారి నుంచి రక్షించే అవకాశముంది. ఇప్పటికే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులకు కేంద్ర బృందం హెచ్‌పీవీ టీకాలపై సూచనలు ఇచ్చింది.
మెడికల్ ఆఫీసర్లకు అవగాహన
జిల్లాలో త్వరలో నిర్వహించే హెచ్‌పీవీ (కేన్సర్ నిరోధక) టీకాల నిర్వహణకు ఈనెల 10న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. టీకాలు వేసే కార్యక్రమంపై పూర్తిస్థాయిలో వివరించారు. వీరంతా తిరిగి మండలస్థాయిలో సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరిలో ప్రారంభమైన తేదీ నుంచి 90 రోజులలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
హెచ్‌పీవీ టీకాలు 2026 జనవరిలో జిల్లాకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో టీకాల కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌పీవీ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ టీకాలు వేసిన మాదిరిగానే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేసే కార్యక్రమం చేపడతాం.
– డాక్టర్ సాజిదాఅతహరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐవో)
గర్భాశయ, రొమ్ము, నోటి కేన్సర్, రుతుస్రావ ఇబ్బందులు, బరువు, థైరాయిడ్, లైంగిక వ్యాధులు, బీపీ, మధుమేహం, రక్తహీనత వంటి పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి
రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మంగళవారం మహిళా వైద్యాధికారులు, సిబ్బంది మహిళలకు పరీక్షలు చేస్తూ అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్లి శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు, మహిళా పోలీసులకు వైద్య పరీక్షలు చేశారు. రొమ్ము, గర్భాశయ, నోటి కేన్సర్ల గుర్తింపుతోపాటు మూత్ర పిండాల పరీక్షలు, రుతుస్రావ ఇబ్బందులు, లైంగికంగా వచ్చే సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, బరువు, థైరాయిడ్, బీపీ, మధుమేహం (షుగర్), అయోడిన్ లోపం, రక్తహీనత పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,81,000 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించగా, 89 మందికి గర్భాశయ కేన్సర్, 109 మందికి బ్రెస్ట్‌కేన్సర్, 101 మందికి ఓరల్ కేన్సర్ నిర్ధారణ అయింది. వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
కేన్సర్‌పై టీకాస్త్రం
కేన్సర్‌పై టీకాస్త్రం
కేన్సర్‌పై టీకాస్త్రం


